Jubilee Hills By Elections | కాంగ్రెస్ చిల్లర చేష్టలను ప్రజలు ఛీద్కరించుకుంటున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రెహమత్ నగర్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన దళిత్ స్టడీ సెంటర్లో ఆయన గురువారం మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి సునీత భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతం అయితే. .. కాంగ్రెస్ మంత్రులు చిల్లర మాటలు మాట్లాడటం బాధాకరమని అన్నారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని దాస్యం వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగడతామని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని.. తమ అభివృద్ధిగా చూపించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దానికి ఈ దళిత్ స్టడీ సెంటర్‌నే నిదర్శనమని అన్నారు. కేసీఆర్ నిర్మించిన ఈ దళిత్ స్టడీ సెంటర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెబుతారని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మహిళలను, రైతులను, నిరుద్యోగులను, యువతను, బీసీ ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో చేసింది ఏమీ లేదని, కోతలు, కమిషన్లు, కూల్చివేతలని విమర్శించారు. హైదరాబాద్‌ను విశ్వ నగరాల సరసన నిలిపిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందని అన్నారు