సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని జోరుగా బెట్టింగ్ జరుగుతున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన, రెండేండ్ల్ల ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీయే గెలవాలని కోరుకుంటున్నారు. జుబ్లీహిల్స్ ప్రజలు కూడా అదేవిధంగా బీఆర్ఎస్ వైపే ఉండే అవకాశాలున్నాయని, ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని బెట్టింగ్ రాయుళ్లు, ఫంటర్లు చర్చించుకుంటున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని, మరికొన్ని బీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయి.
అయితే గెలుపోటుముల మధ్య తేడా 5 శాతంలోపే ఉంటుందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల అంచనాలకు అనుగుణంగానే బీఆర్ఎస్ గెలవనుందని బీఆర్ఎస్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీగా డబ్బు పంచడంతో పాటు దొంగ ఓట్లు, రిగ్గింగ్‌తో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉండటంతో అవేమీ ఇక్కడ పనిచేసే అవకాశాలు లేవని కూడా చర్చ జరుగుతున్నది. మళ్లీ కేసీఆర్ సారే రావాలంటూ అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ర్టాల బెట్టింగ్ రాయుళ్లు శుక్రవారం వెలువడే జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కు ఎక్కువ అవకాశాలున్నాయని ట్రెండ్ అవుతుండగా, ఎన్నికల ఫలితాలు వెలువడటం ప్రారంభమయ్యే వరకు .. బీఆర్ఎస్పై 10 లక్షల రూపాయలు బెట్టింగ్ పెడితే, గెలిచిన తర్వాత బెట్టింగ్ పెట్టిన వాళ్లకు డబుల్ (రూ. 20 లక్షలు) ఇచ్చేలా ఈ దందా నడుస్తోందని టాక్. అయితే ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఓటర్ మనస్సును పసిగట్టలేకపోయాయనే వాదనలూ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి భారీగా డబ్బులుపంపిణీ చేసినప్పటికీ.. వారి వద్ద డబ్బులు తీసుకున్నఓటర్.. బీఆర్ఎస్కే ఓటువేశారనే టాక్ కూడా నడుస్తున్నది. మొత్తం మీద తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో .. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయని సమాచారం.
