మేడ్చల్, నవంబర్ 19 : ఎవ్వరూ అధైర్య పడొద్దు, భవిష్యత్ బీఆర్ఎస్దే, రానున్న అన్ని ఎన్నికల్లో గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బుధవారం మాజీ మంత్రి మల్లారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, పలువురు నేతలు నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక మెజార్టీ సాధించడం ఖాయమన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలతోపాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. జూబ్లీహిల్స్‌లో అక్రమాలు, డబ్బు లు పంపిణీ చేసి కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయని, ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరిక
కొండాపూర్, నవంబర్ 19 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకొకరిగా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బుధవారం కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్ కుమార్, లింగంపల్లి షాప్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే.శంకర్లు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. కాంగ్రెస్, బీజేపీలలో నాయకుల మధ్య పొంతనలేక, అడుగడుగున అవమానాలను ఎదురోలేక పార్టీని వీడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సాధనం చెప్పలేకపోతున్నట్లు నాయకులు వాపోతున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించేందుకు ఒకొకరిగా పార్టీలో చేరుతున్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు నవతారెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్తనూ కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు. క్లాసికల్ డాన్స్ టీచర్ మాదాని దివ్యరెడ్డి, కే.రఘునాధ్రెడ్డిలతో పాటు అనుచరగళం పార్టీలో చేరింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాలా హరీష్, మిద్దెల మల్లారెడ్డి, పారునంది శ్రీకాంత్, సంగారెడ్డి, గౌస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.