సిటీబ్యూరో/బోరబండ, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : హైడ్రాను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులంతా బ్లాక్ మెయిల్ దందాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి, కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఎఫ్టీఎల్ పరిధిలో బంగ్లాలు, విల్లాలు కట్టుకున్నా ఏ ఒక ఇంటి జోలికి వెళ్లడానికి సాహసించని హైడ్రా, పేదల ఇండ్ల మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ నాయకుడు మహ్మద్ సర్దార్ కుటుంబాన్ని బుధవారం కేటీఆర్ పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. సర్దార్ ఇద్దరు చిన్న పిల్లలను చూసి కేటీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. తన ప్రాణం ఉన్నంత వరకు సర్దార్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సర్దార్ పిల్లలైన ఇద్దరు చిన్నారులకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల ఫిక్స్ డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతో ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను సర్దార్ కుటుంబానికి కేటీఆర్ అందజేశారు.
ఆనంతరం మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. యూపీలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని గొంతుచించుకుంటున్న రాహుల్ గాంధీకి, తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అంటుంటే, తెలంగాణను రేవంత్‌రెడ్డి నఫ్రత్ కా మకాన్ లాగా మార్చేశాడని కేటీఆర్ విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయాక కూడా కేసీఆర్ సైనికుడిగా బీఆర్ఎస్లోనే ఉన్న సర్దార్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని స్థానిక కార్పొరేటర్ అధికార మత్తులో వేధించాడని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారడానికి ఒప్పుకోకపోవడంతో కక్ష కట్టి సర్దార్ ఇంటిని, షాప్‌ను కూల్చివేయించాడని ఆరోపించారు.
తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బీఆర్ఎస్ నేతలు, పేదలను వేధిస్తున్న కాంగ్రెస్ నేతల, అధికారుల హిసాబ్ కితాబ్ సెటిల్ చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆడిచ్చినట్టు ఆడుతున్న అధికారులు ఇప్పటికైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. పదేళ్ల పాటు పేదల బతుకుల్ని మార్చడానికి పనిచేసిన తాము రేపు అధికారంలోకి వచ్చాక ఇలానే వ్యవహరిస్తే ఒక కాంగ్రెస్, బీజేపీ నేత కూడా రోడ్డు మీద తిరగలేడని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఉన్న మురికివాడల్లో ఏది రైటో ఏది రాంగ్ అనేది ఆ దేవుడు కూడా చెప్పలేడని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆటో కూడా రాలేని గల్లీల్లో ఉంటున్న గరిబోళ్ల మీద హైడ్రా, జీహెచ్ఎంసీని అడ్డంపెట్టుకుని రేవంత్ ప్రభుత్వం విచ్చలవిడిగా అరాచకం సృష్టిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ లోని మురికివాడల్లో ఉంటున్న పేదల దుస్థితి చూసి చలించిన కేసీఆర్, భవిష్యత్ తరాలైనా బాగుండాలన్న సదుద్దేశ్యంతో జీవో నంబర్. 58 కింద లక్ష మందికి ఉచితంగా పట్టాలు ఇచ్చారన్నారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్‌లోని మురికివాడల్లోని నోటరీ ప్రాపర్టీస్‌ని రెగ్యులరైజ్ చేసేందుకు తమ ప్రభుత్వ హయాంలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా బుద్ధి, పేదల పట్ల ప్రేమ ఉంటే ఈ నోటరీ ప్రాపర్టీస్‌ని కూడా రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల కంటే రెండు పనులు ఎకువ చేయాలే కాని గరీబోళ్ల కడుపు మీద కొట్టి వారి నోటికాడ బువ్వ గుంజుకోవద్దని విజ్ఞప్తి చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అడ్డం పెట్టుకుని వేధించినందుకే తమ నేత మహ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా, మూసీ, లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉన్నది కేసీఆర్ సైనికులే అని, రెండు రోజులుగా గద్వాల్ జిల్లా ధన్వాడలో రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఏమైనా కక్షలు ఉంటే తమపై కేసులు పెట్టి జైలుకు పంపాలే కాని.. పేదల జోలికి రావద్దన్నారు. పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బీఆర్ఎస్ కచ్చితంగా అడ్డుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
సర్దార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్దార్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన పిల్లల చదువు, భవిష్యత్‌కు భరోసాగా ఉంటామన్నారు. స్థానిక కార్పొరేటర్ కూల్చివేయించిన సర్దార్ దుకాణం, ఇంటిని పార్టీనే బాగు చేయిస్తుందని చెప్పారు. సర్దార్ ఫ్యామిలీ తమ బీఆర్ఎస్ ఫ్యామిలీనే అని, చివరి క్షణం వరకు వాళ్లకు అండగా ఉంటామన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత నేత మాగంటి గోపీనాథ్ లేని లోటును రానివ్వమన్నారు. బీఆర్ఎస్ క్యాడర్‌కు ఏ కష్టం వచ్చినా.. ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, వెల్దండ వెంకటేశ్, దేదీప్య తదితరులు పాల్గొన్నారు.