సిటీబ్యూరో: ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్న కంటోన్మెంట్‌లోని రూ.800 కోట్ల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈమేరకు సోమవారం కలెక్టర్ ప్రియాంక ఆలకు కలిసి వినతి పత్రం అందజేశారు. కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తోకట్ట సర్వే నంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995 నుంచి రెవెన్యూ రికార్డుల్లో ‘పోరంబోకు సర్కారీ’ ప్రభుత్వ భూమిగా ఉన్నదని అన్నారు. 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద ఆ భూమి ప్రభుత్వానిదేనని రికార్డుల్లో ఉందన్నారు.
అన్ని రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న విలువైన స్థలం చుట్టూ ప్రైవేట్ వ్యక్తులు ప్రహరీ నిర్మించి కబ్జాకు పాల్పడ్డారన్నారు. 2025లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆ స్థలంలో 600 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. ఆ ప్రతిపాదనలో ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించిన భూమిని కబ్జా చేస్తుంటే.. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని క్రిశాంక్ ప్రశ్నించారు.
పేదల కోసం ఇండ్లు కట్టిస్తారనుకుంటే కబ్జాలు చేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు క్రిశాంక్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ భూ వివాదంపై స్పందించి ఇండ్లను నిర్మించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు. సంబంధిత భూరికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. కబ్జాదారులపై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.