కంటోన్మెంట్, జనవరి 6 : నాలుగువేల కోట్ల రూపాయలతో కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేశామని సీఎం రేవంత్‌రెడ్డి ఓ పక్క ప్రచారం చేస్తుండగా.. సోమవారం జరిగిన అసెంబ్లీ జీరో అవర్‌లో కంటోన్మెంట్లో డ్రైనేజీ, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు విడుదల చేయాలని, సీఎం రేవంత్ అబద్ధాల పరిపాలన చేస్తున్నాడని స్వయంగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేనే బట్టబయలు చేశారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ అన్నారు. మంగళవారం పికెట్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తిగా అబద్ధ్దాలతో జరుగుతోందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కంటోన్మెంట్ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీగణేశ్ రూ.50 కోట్లు విడుదల చేయాలని వారి ప్రభుత్వాన్ని కోరడం తాము స్వాగతిస్తున్నామని… ఐదు వేల కోట్ల మాట దేవుడెరుగు కనీసం రూ.50కోట్లు విడుదల చేస్తారా అని ఎద్దేవా చేశారు.
డబుల్బెడరూంలు ఎందుకు కేటాయించడం లేదు..?
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న హాయాంలో రూ.900 కోట్లతో టిమ్స్ దవాఖాన, మారేడుపల్లి, రసూల్‌పురా సిల్వర్ కాంపౌండ్, నారాయణ జోపిడి సంఘం, మడ్‌ఫోర్ట్ ప్రాంతాల్లో డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించారని.. ఆ ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా ఎమ్మెల్యే దేనికోసం నిలిపివేశారని మన్నే క్రిషాంక్ ప్రశ్నించారు. గతం ప్రభుత్వంలో కంటోన్మెంట్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని, ఉచిత మంచినీటి పథకం అమలు చేశారని. నీటి బిల్లులను మాఫీ చేశారని, రాష్ట్ర పండుగల కోసం వస్ర్తాలు, కానుకలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ నిలిపి వేసిందని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల కోసమే మహిళా గ్రూపులకు చీరలు ఇచ్చారని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎంటో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.
సీబీఐ కేసుల్లో జైలుకెళ్లినవారు.. నాపై విమర్శలా
గుంతలకు అతుకులు వేస్తే తాము అభివృద్ధి చేశామని బీజేపీకి చెందిన నామినేటేడ్ సభ్యురాలు బుక్‌లు ప్రింట్ చేయించారని, పికెట్ పార్కులో వాజ్పాయ్ విగ్రహాన్ని రూ.1.90 కోట్లతో ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. సీబీఐ కేసులో జైలుకు వెళ్ళిన నాయకుడు తనపై వివర్శలు చేస్తున్నారని వ్యంగంగా అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నానని సమస్యలపై ప్రశ్నలు వేస్తానని, విమర్శలు చేస్తానని వాటికి సమాధానం చెప్పేందుకు వీలులేక బీజేపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. తన ఆస్థుల విషయంలో సర్వే సత్యనారాయణ ముందే చర్చ పెడతానని, తాను డాక్టరేట్నని, లా, జర్నలిజం చేశానని, తాను విద్యాధికుడినని అన్నారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదని విమర్శిస్తున్న వారు ఇప్పుడు అనుభవిస్తున్న పదవి నామినేటెడ్ కాదా అన్నారు. మామా అల్లుడుకు ఆస్తి ఇస్తారని, వాళ్ళకు ఇవ్వరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్, శత్రు, యాసిన్, మోని, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.