Talasani Srinivas Yadav | బేగంపేట, ఏప్రిల్ 21: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 వ తేదీన నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సోమవారం నాడు తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభకు సంబంధించిన అంశాలపై కార్యకర్తలు, నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ప్రతి బస్తీ, కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. స్వరాష్ట్ర సాధనతోనే న్యాయం జరుగుతుందని గుర్తించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన విషయాన్ని గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి మళ్లీ మొదటికొచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తలసాని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ శ్రీ రామరక్ష అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 27 వ తేదీన అన్ని డివిజన్లలో పార్టీ జెండాలను ఎగురవేసి పార్టీ పండుగను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. వరంగల్ జిల్లాలో నిర్వహించే రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు.