సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రేటర్ గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం నేపథ్యంలో చరిత్రలో గుర్తుండి పోయేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభను వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహిస్తున్నారు. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి రెండున్నర దశాబ్ధాల కాలంలో అనేక అద్భుత ఘట్టాలకు సాక్షాత్కారమై నిలిచింది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్గా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
చారిత్రాత్మకమైన రజతోత్సవ సభలో పాలుపంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలన తీరుపై విసుగెత్తి పోతున్న ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ సభకు హాజరు కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభకు ఎలా ప్లాన్ చేశారు.. సన్నాహక సభల రెస్పాన్స్ ఎలా ఉంది.. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు.. 16 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమంటున్నారు.. సభ రోజున ఎంత మంది వెళ్తున్నారు.. అన్న అంశాలపై మాజీ మంత్రి, సనత్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
స్వయం పాలన, తమ రాష్ట్రం మాకు కావాలె అన్న ఏకైన నినాదంతో ఒక్కడితో కేసీఆర్ గులాబీ జెండా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001లో జలదృశ్యం వేదికగా ప్రారంభమైన కేసీఆర్ నాయకత్వం సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించారు. రాష్ట్ర ఏర్పాటు ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమైతదని ప్రజలంతా కేసీఆర్‌కు అండగా నిలిచారు. తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ చచ్చుడో అని 2009 సంవత్సరంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పనిచేస్తున్న సమయంలో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ దవాఖానకు కేసీఆర్‌ను తరలించారు.
మొక్కవోని దీక్షతో కేసీఆర్ దవాఖానలోనే దీక్షను కొనసాగించారు. ఎంపీగా ఉన్న కేసీఆర్ ప్రాణాలను లెక్క చేయకుండా అమరణ నిరాహార దీక్షను కొనసాగించడం, చనిపోయే స్టేజిలో ఉన్నారని గుర్తించిన యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో చిదంబరంతో ప్రకటన చేయించారు. అన్ని వర్గాలను ఏకం చేసి ఉద్యమం చేసిన ఫలితంగా సోనియాగాంధీ దిగొచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైనది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ చరిత్రను ఎవ్వరూ చెరపలేరు.
ఉద్యమ నాయకుడే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు రాష్ట్రం నీళ్లు, నిధులు, కరెంట్, సంక్షేమ పథకాలు లేక అల్లాడిపోయిన రాష్ర్టాన్ని అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో ప్రగతిపథం వైపు నడిపించారు. ఇతర దేశాలు, రాష్ర్టాలకు వలసలు వెళ్లిన వారంతా స్వంత రాష్ర్టానికి తిరిగి వచ్చేలా చేశారు. వలసలు ఆగడమే కాదు ఇతరులను తెలంగాణ రాష్ర్టానికి ఉపాధి బాట పట్టించారు. ఇందుకు కరోనా లెక్కలే నిదర్శనం. దాదాపు 25 లక్షల మంది హైదరాబాద్‌కి వలస వచ్చి తెలంగాణలో పనిచేసే పరిస్థితులు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. మినీ ఇండియా హైదరాబాద్‌లో కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని, కరెంట్, నీళ్లకు అన్నింటికంటే మించి శాంతిభద్రతల సమస్య లేదని కితాబు ఇచ్చిన పరిస్థితి. దేశంలోనే నంబరు వన్ గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు.
రజతోత్సవ సభ చారిత్రాత్మకమైనది. 14 ఏండ్ల ఉద్యమం తర్వాత 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రంలో అద్భుత పాలన అందించారు.. తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా కేసీఆర్ నిలబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు నేడు కూడా బహిరంగ సభలకు కేసీఆర్ పిలుపునిస్తే లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు, అందుకే కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసమే కారణం. ఈ సభకు పార్టీ ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చేలా రూపకల్పన చేశాం.
ఉద్యమ స్ఫూర్తిని ఎలా చాటారో అదే పంథాలో సభకు తరలివెళతాం. ప్రతి నియోజకవర్గం నుంచి 4 వేల మంది వస్తారు.. ఎక్కడికక్కడ జెండాను ఎగరవేసి వరంగల్ సభకు తరలివెళ్తాం. దేశ రాజకీయాల్లో ఈ సమావేశం చరిత్రగా నిలువనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్న వాళ్లకు కూడా ఈ సభ సమాధానం చెబుతుంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తాం. పార్టీ శ్రేణులే కాదు ప్రజలు, రైతులు, విద్యార్థులు, కార్మికులు ,కర్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.