సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : బహిరంగ సభలు, సమావేశాలకు బీఆర్ఎస్ పెట్టింది పేరు.. సందర్భం ఏదైనా ప్రాంగణ వేదిక కిక్కిరిసిపోవాల్సిందే.. ఎటూ చూసినా గులాబీ మాయం కావాల్సిందే.. సబ్బండ వర్గాలు గులాబీ జపం చేయాల్సిందే.. గత సభలు మాదిరిగానే ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వైపే గ్రేటర్ జనం చూపులు సాగాయి.. రోజంతా రజతోత్సవ వేడుకపై విస్తృత చర్చ జరిగింది. నగరమంతా పండుగ వాతావరణం సంతరించుకున్నది.
వినూత్న రీతిలో..
గ్రేటర్‌లోని నలుమూలల నుంచి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు స్వచ్చందంగా వరంగల్ సభకు చేరుకున్నారు. ప్రత్యేక వాహనాలను సమకూర్చుకుని గులాబీ జెండాలు, కండువాలు, టోపీలు ధరించి వినూత్న రీతిలో కదిలారు. ఆయా నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి సభకు తరలివెళ్లారు. ఈ సభకు అన్నివర్గాల ప్రజానీకం తండోపతండాలుగా తరలివెళ్లింది. సైకిల్ నుంచి బస్సుల దాకా ర్యాలీలుగా వెళ్లారు. ఈ సందర్భంగా జై తెలంగాణ నినాదాలతో ప్రధాన రహదారులన్నీ హోరెత్తాయి.
సబ్బండ వర్గాలు..
25 ఏండ్ల బీఆర్ఎస్ పండుగను సబ్బండ వర్గాలు ఘనంగా నిర్వహించారు. ఉదయమే డివిజన్ల వారీగా గులాబీ జెండాను ఎగరవేసి సభకు వెళ్లారు. అంబర్‌పేట అలీ కేఫ్ వద్ద మాజీ మంత్రి మహమూద్ అలీ, కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బోయిన్పల్లి నుంచి ఎమ్మెల్యే మల్లారెడ్డి, బోరబండ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, మూసాపేట నుంచి మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, హయత్‌నగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బడంగ్‌పేట నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, జవహర్‌నగర్ నుంచి మాజీ మేయర్ మేకల కావ్య, ముషీరాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మెట్టుగూడ నుంచి ఎమ్మెల్యే పద్మారావు, ఏఎస్రావు నగర్ నుంచి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శ్రేణులతో కలిసి సభకు వెళ్లారు. గ్రేటర్ నుంచి దాదాపు లక్షలాది మంది సభకు తరలివెళ్లి గ్రేటర్ గులాబీ సత్తాను చాటారు.
సోషల్‌మీడియాలో బీఆర్ఎస్ హవా
సిటీబ్యూరో: బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగను గ్రేటర్ ప్రజలు ఇంటిల్లిపాదిగా జరుపుకొన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభకు వెళ్లలేని వాళ్లంతా సామాజిక మాధ్యమాలు, టీవీలకు అతుక్కుపోయారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపన్యాసం కోసం ఎంతగానో ఎదురుచూశారు. గ్రేటర్ ప్రజలంతా సాయంత్రం ఐదు గంటలకల్లా పనులన్నీ ముగించుకొని టీవీల ముందు కూర్చుకున్నారు. యువత యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లలో రజతోత్సవ సభను తిలకించారు. కేసీఆర్ వేదిక మీదికి వచ్చి అభివాదం చేస్తున్న తరుణంలో పెద్దకొడుకొచ్చిండని ఇంట్లో ఉండే అవ్వా..తాతలు ఆనందపడ్డారు.
కేసీఆర్ మాట్లాడినంతా సేపు ఆసక్తితో తిలకించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రత్యేక్ష ప్రసారం ద్వారా ప్రముఖ టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వీక్షించారు. బీఆర్ఎస్ పాలనలో గుడిసెలు ఉన్నవారికి డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తే నేడు చెరువుల పూడికలు తీయాల్సిన బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చుతున్నారని కేసీఆర్ నోటి వెంట రావడంతో టీవీల ముందు కూర్చున్నవారంతా పదేళ్లపాటు కేసీఆర్ అందించిన సుభిక్ష పాలనను గుర్తుచేసుకున్నారు.
బీఆర్ఎస్ పాలనలో అడవుల రక్షణ కోసం హరితహారం చేపట్టిన తీరుపై నేడు హెచ్‌సీయూ భూముల కోసం పోరాడిన విద్యార్థులు, పర్యావరణ వేత్తలు గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో ప్రత్యేక్ష ప్రసారం జరుగుతున్నంత సేపు కామెంట్ బాక్స్‌లో ‘సీఎం కేసీఆర్, సారే కావాలి, సారే రావాలి, తెలంగాణ విధాత’అంటూ కామెంట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.