“నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా.. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర. 50 ఏండ్ల పాలనలో పేదలు, దళితుల బతుకులు ఎలా ఉండే. రైతుల సమస్యలు ఎలా ఉండేనో ఆలోచించాలె.. ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడ్డదెవరు ?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా పరిధిలోని మధిర, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కమల్‌రాజ్, మదన్‌లాల్‌కు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్ నాయకులు దళిత బంధులాంటి పథకం తెచ్చారా ? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో కందిళ్లు, కిరోసిన్ బుడ్లు, ఎండిన వరికంకులు తెచ్చింది కాంగ్రెస్ పాలన పుణ్యమేనని… పదేండ్ల తెలంగాణలో ఎక్కడైనా ఎకరం పొలమైనా ఎండిందా? అని అడిగారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నామని, రైతులకు కరెంటు, సాగునీళ్లు తెచ్చుకున్నామన్నారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో కరువే ఉండదన్నారు. మార్పు కావాలంటే.. మధిరలో భట్టి విక్రమార్కను మార్చాలని, 24 గంటల కరెంటు కావాలంటే.. కమల్‌రాజ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. మా తండాలో మారాజ్యం అన్న నినాదాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని, కానీ బీఆర్ఎస్ వచ్చాక 3500 తండాలను పంచాయతీలుగా మార్చామన్నారు. అలాగే 3,650 కుటుంబాలకు 7,140 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని చెప్పారు. వైరాలో మదన్‌లాల్‌ను గెలిపించండి.. మీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నాది” అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముగించారు.