కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి.. ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పవర్లోకి రాగానే మాటమార్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఫార్మాసిటీ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుడి తే…నేడు అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఆ ప్రాంతంలో నాలుగు రకాల పేర్లుపెట్టి ఇష్టానుసారంగా దండుకుంటున్నది. ఈ విషయంపై ఫార్మాసిటీ ప్రాంత రైతులు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. ప్రస్తుత సర్కారు మాటలకే సరి పోయింది. చేతల్లో ఏమి లేదు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని చెప్పినందున వెం టనే దానిని రద్దు చేసి.. ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలి.
– సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే
KTR | రంగారెడ్డి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం రూరల్ : ఫార్మాసిటీపై రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ దొంగ మాటలేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దసరా సమ్మేళనం ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రమీద గార్డెన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు మంచిరెడ్డి ప్ర శాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..ఫార్మాసిటీ ఉందని ఒకసారి, లేదని మరోసారి చెబుతూ రేవంత్‌రెడ్డి కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
నాలుగు ఇంచుల భూమినీ సేకరించని ముఖ్యమంత్రి ఫోర్త్‌సిటీని ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు. గ్రీన్‌సిటీ, ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ఎనిమిదేండ్లు కష్టపడ్డారని, రైతులను ఒప్పించి, మెప్పించి 14,000 ఎకరాలను సేకరించామని గుర్తు చేశారు. దమ్ముంటే ఫార్మాసిటీని కట్టు.. లేకుంటే ఆ భూములను రైతులకు ఇచ్చేయని సూచించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, తర్వాత మరోమాట చెప్పి రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసంపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని.. గల్లీ గల్లీ తిరిగి ప్రజలకు వివరిస్తామన్నారు. ఫార్మా రైతులనే కాదు.. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. గ్రామగ్రామాన మనమే కథానాయకులుగా మారాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.
మూడు పంటలకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పడంతోపాటు కేసీఆర్ ముష్టి రూ.10 వేలు ఇస్తున్నారని.. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఖరీఫ్ రైతు భరోసా ఎగ్గొడుతున్నామని సిగ్గులేకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చావు కబురు చల్లగా చెప్పారని ఎద్దేవా చేశారు. రైతుల తరఫున బీఆర్ఎస్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నదని.. కానీ, ఇతర రైతు సంఘాల నోళ్లు ఎందుకు మూగబోయాయని కేటీఆర్ ప్రశ్నించారు.
రైతుల తరఫున మాట్లాడాల్సిన కమ్యూనిస్టులు ఎక్కడికి పోయారన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా సాక్షాత్తూ రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, పిల్లల ఉద్యోగాల సంగతేమోగానీ..రాహుల్‌గాంధీకి ప్రతిపక్ష నేతగా, రేవంత్‌రెడ్డికి సీఎంగా ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.
స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన మల్రెడ్డి కాదని.. గోల్ మాల్ రెడ్డి అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పైన రేవంత్‌రెడ్డి ఎట్ల ఉన్నాడో..కింది స్థాయిలో నాయకులూ అలాగే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే కూడా మైనింగ్, రైస్‌మిల్లుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఇబ్రహీంపట్నంతో సహా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే గా ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారని కొనియాడారు. సబితక్క సైతం స్వార్థం లేకుండా పనిచేశారని.. కలెక్టరేట్, ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలను కొంగర కలాన్‌లో ఏర్పాటు చేయించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు.
పొలీసులు కేసులు పెడితే బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ సమావేశంలో పిక్ పాకెట్, చైన్ స్నాచర్స్ ఉన్నారని, వేదికపై ఉన్న నాయకులకు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వగా.. కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. పిక్ పాకెట్, చైన్ స్నాచర్స్ బీఆర్ఎస్ మీటింగుల్లో ఉండరని, కాంగ్రెస్ మీటింగుల్లో ఉంటుందని చురక అంటించారు. ఇటీవల జరిగిన ఏ బీఆర్ఎస్ సమావేశాల్లోనూ ఇంతమంది పోలీసులను చూడలేదన్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేశ్, రాష్ట్ర యువ నాయకుడు ప్రశాంత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మొద్దు అంజిరెడ్డి, జేపీ శ్రీనివాస్, ఆకుల యాదగిరి, మండలపార్టీ అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, రమేశ్, కిష్గౌడ్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు అల్వాల వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్య, ప్రధాన కార్యదర్శులు బహదూర్, భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్‌రావు, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, నాయకులు శివసాయి, ప్రసాద్‌గౌడ్, ప్రవీణ్‌నాయక్, కొండ్రు ప్రవీణ్, దేవేందర్‌గౌడ్, గరిగె శేఖర్‌గౌడ్, రాజు, జానీపాషా, కరుణాకర్, గణేశ్, బల్వంత్‌రెడ్డి, జంగయ్య ముదిరాజ్, అరవిందర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.