మేడ్చల్, అక్టోబర్ 27 : గెలుపులో తాను హ్యాట్రిక్ కొట్టబోతుంటే… కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో బీఆర్ఎస్ నేత రామన్నగారి రాఘవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంపీగా ఒకసారి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి అయిన తాను ఈ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధిస్తానని, కాంగ్రెస్ అభ్యర్థి జంగయ్య యాదవ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయారని, మరోసారి ఓటమికి సిద్ధం అవుతున్నాడన్నారు. విశ్వాసానికి, నమ్మకానికి మారుపేరు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని, దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ పథకాలు అమలు చేశాయా? అని అన్నారు.
కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని దివాళా తీయించిందన్నారు. 24 గంటల కరెంట్ కాదు కదా కనీసం 6 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వ్యవసాయాన్ని అధోగతి పాలు చేస్తుందని తెలిపారు. మేడ్చల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు ఒకసారి కూడా ముఖం చూపించలేదని, అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. కానీ పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొని, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నాడని మంత్రి ఆరోపించారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ నాశనం అవుతుందని, టీడీపీ రాష్ట్రంలో లేకుండా చేశారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా ఉండదని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో సాయిరాం, రాము, శ్రీధర్, బుచ్చమ్మ, వినయ్‌తోపాటు 200 మంది యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేశారు. వారందరికి మంత్రి బీఆర్ఎస్ కండువాకప్పి పార్టీకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, శివకుమార్, బీఆర్ఎస్ నేతలు రాఘవేందర్ గౌడ్, మర్రి నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలకు, అభివృద్ధికి ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నుంచి పెద్దఎత్తున వలసలు మొదలయ్యాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట గ్రామానికి చెందిన బీఎస్పీ సయ్యద్ హైమద్, బీర్కురి జహంగీర్, కైర గణేశ్‌లతోపాటు 15 మంది బీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయం సాధిస్తుందన్నారు. అనంతరం లాల్‌గడి మలక్‌పేటలో పర్యటించిన మంత్రి ముస్లిం సోదరులతో కలిసి మజీద్ వద్ద మాటామంతి నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తామని, గెలుపును కాం క్షిస్తూ మంత్రికి మిఠాయి తినిపించి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గ దయాకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితాలాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత, పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి, జడ్పీ కోఆఫ్షన్ సభ్యుడు జహీరుద్దిన్, సర్పంచ్ వనజశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ ఇందిరా రాజిరెడ్డి, మైనార్టీ సోదరులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.