మణికొండ, మే 9: అసలే మండుతున్న ఎండలు.. ఆపై గొంతు ఎండుతున్న ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. సమయానికి తాగునీటి సరఫరా రాక ఇదేమిటని ప్రశ్నిస్తే జలమండలి (Jelamandali) లైన్మెన్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం.. కాదంటే డబ్బులు ఇచ్చేవారికి మాత్రమే నీటి సరఫరా అందిస్తూ అనుకూలం ఉన్న వారికే గంటల తరబడి సరఫరా చేస్తున్నారంటూ కాలనీల ప్రజలు మండిపడుతున్నారు. వేసవి కాలంలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు తాగునీటిని సరాఫరా చేయాల్సిన జలమండలి యంత్రాంగం, ఉన్నతాధికారులు సైతం అనుకూలంగా ఉన్న అపార్ట్మెంట్ వాసులకు బల్క్‌గా నీటి కనెక్షన్లు ఇస్తూ.. కాలనీలలో నివాసం ఉంటున్న ప్రజలకు నీటిని అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు.
గుడ్ మార్నింగ్ మణికొండ.. పేరుతో మణికొండ మున్సిపాలిటీలోని నెక్నంపూర్ పరిధిలో ఉన్న అల్కాపూర్ రోడ్డు 1 పరిసరప్రాంత ప్రజలను కలుసుకొని స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.
1. జలమండలి లైన్మెన్లు వారి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇష్టం ఉన్న ప్రాంతంలో 2 గంటల మంచినీటి సరఫరా చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో వేళా పాల లేకుండా అరగంట మాత్రం సరఫరా చేస్తూ చిత్ర విచిత్ర లీలలు చూపుతున్నారని వాపోయారు. ఇకపోతే స్పోర్ట్స్ పార్కులో ఉన్న నీటి రిజర్వాయర్‌ను నామమాత్రంగా ఫిబ్రవరి 6న మొదలు పెట్టి ఇప్పటికీ నీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2. ప్రఖ్యాతి చెందిన అల్కాపూర్ కాలనీలో దరిదాపు అన్ని ఖాళీ స్థలాలతో పాటు వీధులన్నీ చెత్తా చెదరంతో నిండిపోయాయని, అయినా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.
3. విద్యుత్ సరఫరా సరిగా లేదని, వీధి దీపాలు అసలు వెలగడం లేవని, చిమ్మ చీకటిలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జలమండలి మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత కొన్నాళ్లుగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో గుడ్ మార్నింగ్ మణికొండ పేరుతో ప్రజలతో కలిసి వారి అభిప్రాయాన్ని సేకరిస్తూ సమస్యలను నివేదిక రూపంలో అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం తెలిపారు ఇప్పటివరకు చాలా ఖాళీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిక రూపంలో రూపొందించి అధికారులు తీసుకువెళ్లామని గుర్తు చేశారు. వీటిలో చాలావరకు సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులోనూ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలలో బి ఆర్ ఎస్ పార్టీ పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తామని సీతారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, బొమ్ము ఉపేందర్నాథ్ రెడ్డి, షేక్ ఆరిఫ్ మహమ్మద్, రాజేంద్ర ప్రసాద్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.