జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకత్వం మొత్తం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లతో పాటు అన్ని నియోజకవర్గాలకు చెందిన కీలకనేతలంతా ఉత్సాహంగా నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని కోరుతున్నారు. వెంగళరావునగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆసక్తిగా చదువుతూ కెమెరాకు చిక్కారు.
– జూబ్లీహిల్స్ జోన్, అక్టోబర్ 22
మాగంటికి చెప్పిన వెంటనే పనులు జరిగేవి
పౌర సమస్యలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులనైనా నేరుగా మాగంటికి పంపితే చాలు.. నిర్ణీత సమయంలోపు పరిష్కారమయ్యేవి. వర్షాకాలంలో వరద కష్టాలు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సమస్యలు వెంటనే తీర్చేవారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో స్థానికంగా మాగంటి చేపట్టిన అభివృద్ధి పనులు కోకొల్లలు. పేదల బస్తీలు, కాలనీలకు మాగంటి
మరణం తీరని లోటు.
– అఫ్సర్, సుల్తాన్‌నగర్, ఎర్రగడ్డ
ఖర్చుచేసే ప్రతీ పైసాను లెక్కించాలి
జూబ్లీహిల్స్,అక్టోబర్ 22: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థుల ప్రచారం కోసం ఖర్చుచేసే ప్రతిపైసాను లెక్కించి అభ్యర్థుల ఖాతాలో జమచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తదితర అంశాలపై సమీక్షించారు. అభ్యర్థుల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో పాటు మీడియాలో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ తదితర ప్రచార అంశాలపై నిఘా పెట్టాలన్నారు. ఖర్చుల వివరాలను ప్రతిరోజు రికార్డుల్లో నమోదుచేయాలని సూచించారు.