సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తమ నిరసన గళాన్ని ఉధృతం చేశారు..ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అణగదొక్కే విధంగా గురువారం పాలకమండలిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును నిరసిస్తూ శుక్రవారం ఉదయం బల్దియా కార్యాలయాన్ని ముట్టడించారు.
ప్రధాన కార్యాలయం గేటు వద్ద నిల్చొని సీఎం రేవంత్‌రెడ్డి, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు చేసిన దాడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ చాంబర్, అక్కడి నుంచి మేయర్ చాంబర్ వద్ద తమ నిరసన ప్రదర్శన చేపట్టారు. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధ్దపడగా..కమిషనర్ అందుబాటులోకి లేకపోవడంతో కొద్ది సేపు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
అడిషనల్ కమిషనర్ శివ ప్రసాద్ నాయుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లను కమిషనర్ కార్యాలయంలోకి పిలుచుకుని వారితో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి చర్చ లేకుండా జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను ఆమోదించారని, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడులు చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కార్పొరేటర్లు మన్నె కవితా రెడ్డి, సామల హేమ, ఆర్ సునీత, సింధూ ఆదర్శ రెడ్డి, శాంతిరెడ్డి, దేదీప్య రావులతో కూడిన కార్పొరేటర్ల బృందం ఈ సందర్భంగా శివ ప్రసాద్ నాయుడికి వినతిపత్రం సమర్పించింది.. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడులు చేస్తే మేయర్ కనీసం ఖండించడం లేదని బాలానగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మండిపడ్డారు.
బీసీ మహిళగా గౌరవించి కేసీఆర్ మేయర్ పదవి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తోటి మహిళా సభ్యులపై దాడి చేసిన సాటి మహిళగా ఖండించాల్సిన మేయర్ తీరు బాధాకరమని ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పొడియం ముందుకు వెళ్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ల దగ్గర ఉన్న ప్లకార్డులను గుంజుకొని మేయర్‌పై విసిరి మా మీద నెట్టే ప్రయత్నం చేశారు..మమ్మల్ని అరెస్టు చేయించి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించిన తీరును దుర్మార్గం’ అని కార్పొరేటర్లు సామల హేమ, ఆర్ సునీత అన్నారు.
ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం సంతృప్తిగా లేదని మరో కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 420 రోజులు అయినా కూడా ఒక్క గ్యారంటీని సక్రమంగా అమలు చేయలేదని కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ విమర్శించారు. ప్రతి రోజూ కొత్త వేషంతో ప్రజలను మభ్యపెడుతూ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తిరుగుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ లోపాలను ఎండగడతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు.