మేడ్చల్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అంటేనే మోసమని.. 22 నెలల కాంగ్రెస్ పాలనలో తేలిపోయిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అధ్యక్షతన కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం పేరిట ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులను, మహిళలు, యువతను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు తులం బంగారం లేదు. రైతులకు రుణమాఫీ కాదు.. యువతకు ఉద్యోగాలు ఇప్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని మల్లారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ అంత బోసి పోయిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, వ్యాపారాలు సరిగా నడవక హైదరాబాద్ నగరం అంత బోసి పోయిందన్నారు. మళ్లీ రాష్ట్రమంతా కళకళలాడాంటే తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలన్నారు. కేసీఆర్ రైతుల గుండెల్లో ఉంటే.. కేటీఆర్ యువత గుండెల్లో ఉన్నారన్నారు. త్వరలో జరిగే జూబీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ఇప్పటికే ప్రజలకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన హామీలను ఇచ్చి గెలుపొందిన విషయం ఆర్థమైందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యేల సహకారంతో ప్రజలకు వివరించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు
బడంగ్‌పేట: మహేశ్వరం నియోజక వర్గంలోని ప్రతి గ్రామానికి, గడపగడపకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు చేరే విధంగా బీఆర్ఎస్ నేతలు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎన్ని అమలు చేశారో, ఎన్ని చేయలేదో క్షేత్ర స్థాయిలో ప్రజకు వివరించ వలసిన అవసరం ఉందని సూచించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ప్రతి గడపకు ఆరు గ్యారంటీల కార్డులను కాంగ్రెస్ నాయకులు అందజేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రోజుకో మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి