మేడ్చల్, జూన్ 22(నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి: డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష్ణారావు, చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కలెక్టర్ మను చౌదరికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు కాంగ్రెస్ దళారులు నిరుపేదల నుంచి దోచుకొని ఇండ్లను కేటాయిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంచుకుంటున్నారు తప్ప.. ఒక్క ఇల్లు కట్టింది లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇప్పటి వరకు గృహాలను కట్టెందుకు ఒక్క పునాదినైనా వేసిందా అని ప్రశ్నించారు. మిగిలిన డబుల్ బెడ్రూం కేటాయింపులలో గతంలో మాదిరిగానే లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఇండ్లను కేటాయించాలన్నారు. 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాటకు కట్టుబడి ఉంటారా.. అని ఎమ్మెల్యే వివేకానంద్ ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీలోనే ఒక్క ఇల్లు కట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇండ్లు ఎలా నిర్మిస్తుందని ఎద్దేవా చేశారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నాయకులు అమ్ముకుని దందా చేస్తామంటే నిరుపేదల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని కేపీ వివేకానంద్ అన్నారు.
సమస్యలు పరిష్కరించండి
నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జీఓ నెం 166 ప్రకారం సర్వే నెం 278లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలో తిరస్కరించిన దరఖాస్తులను పున పరిశీలించాలని కోరారు. నియోజకవర్గంలోని భూదాన్ భూముల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని, అల్వాల్ మీ సేవా కేంద్రం రోడ్డు విస్తరణలో కోల్పోతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వెంకటాపురం డివిజన్ టెలికాం కాలనీలో విద్యుత్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన తండ్రి, కుమార్తె కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సాయం అందించాలన్నారు.