MLA Talasani | అమీర్‌పేట్, ఫిబ్రవరి 20 : నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్టు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఉదయం వివిధ విభాగాల అధికారులతో కలిసి సనత్ నగర్ డివిజన్లో ఆయన పర్యటించారు.
ముందుగా బల్కంపేట- ఫతేనగర్ ఫ్లైఓవర్ మార్గంలోని స్మశాన వాటిక సమీపంలో డీసీఎం వాహనాల పార్కింగ్ సమస్యను ట్రాఫిక్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే తలసాని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా డీసీఎం వాహనాల యజమానులే పార్కింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. అనంతరం సనత్‌నగర్‌లోని భగత్ సింగ్ పార్క్ సమీపంలో రూ. 20 లక్షల వ్యయంతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తలసాని, స్థానిక కార్పొరేటర్ లక్ష్మీరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భగత్ సింగ్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యలు కూడా తలెత్తుతున్నాయన స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడే ఉన్న జలమండలి జయం హరిశంకర్‌కు వివరించారు. స్థానికులు కోరుతున్నట్టుగా ముందు మంచినీటి డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఆ తర్వాతే రోడ్డు నిర్మాణాలను చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
2014లో తాను సనత్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాతే ఇక్కడి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని, నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కడా నిధుల లోటు లేకుండా చూశానని, వేలాది కోట్ల నిధులను వినియోగించి నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేసినట్టు ఎమ్మెల్యే తలసాని తెలిపారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న తనకు, నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసునని, వాటి పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, ఈఈ వెంకటేశ్వర రెడ్డి, ఏఎంవోహెచ్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.