MLA Talasani | అమీర్పేట్, జూన్ 22 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందిందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి ఏటా అమ్మవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అయితే జూలై 1న జరిగే ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం కొత్త సంప్రదాయాలకు తెరతీయడం భక్తులను ఇబ్బందులకు గురి చేసేవిగా ఉన్నాయన్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం నాయకులు జయరాజ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రతిఏటా సంప్రదాయ పద్ధతుల్లో దేవాలయ ఆవరణలో మగ్గం అమర్చుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించుకునేందుకు పోచంపల్లి పట్టు వస్త్రాలైన మూడు చీరలను మగ్గంపై తయారు చేసే పనులను ఎమ్మెల్యే తలసాని ఆదివారం దేవాలయ ఆవరణలో పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భక్తులు కల్యాణోత్సవ ఏర్పాట్లకు సంబంధించి కళ్యాణ టికెట్లు, డోనర్ పాసుల సంఖ్యను గణనీయంగా కుదించిన అంశాలను తలసాని దృష్టికి తీసుకువచ్చారు. అక్కడే ఉన్న దేవాలయ అధికారులతో భక్తులు తన దృష్టికి తీసుకు వచ్చిన అంశాలు ప్రస్తావిస్తూ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతోందని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి తప్ప, భక్తులను నియంత్రించే పనుల్లో భాగంగా దేవాలయ ప్రగతికి బాసటగా నిలుస్తున్న దాతలను, వారికి కల్పించే సదుపాయాల పట్ల చిన్నచూపు ఉండరాదని స్పష్టం చేశారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నా, ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు కట్టు తీట్టంగా ఉంటే పరిస్థితి మొత్తం అదుపులో ఉంటుందన్నారు. పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తుల నుండి విరాళాలు పెరుగుతున్నాయని, ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ. కోటి విరాళాన్ని అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
అమ్మవారికి బంగారు బోనం…
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి జులై 2వ తేదీన పాత బస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సుమారు 500 మంది వివిధ దేవాలయాలకు చెందిన కమిటీ ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, EO మహేందర్ గౌడ్, సూపరింటెండెంట్ హైమవతి, BRS పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, బలరాం, శ్రీనివాస్ గౌడ్, వనం శ్రీనివాస్, రాజేష్ ముదిరాజ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.