MLA Sabitha | బడంగ్పేట్, జులై 6 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెద్ద చెరువు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ కోర్టు, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంలో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులను పరిశీలించి పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. క్రీడాకారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు తప్పనిసరిగా చొరవ తీసుకుంటారని ఆమె భరోసా ఇచ్చారు. పనులు త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పెద్ద చెరువు సుందరీకరణ పనులను ఆమె పరిశీలించారు. సుందరీ కర్ణ పనులను త్వరగా పూర్తిచేస్తే స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టుకు సూచించారు.
చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేసింది బీఆర్ఎస్
రాష్ట్రంలో ఉన్న చెరువులను పరిరక్షించాలన్న ఉద్దేశంతో చెరువులను అభివృద్ధి చేయడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో ఉన్న పూడిక తీసి చెరువులను పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. చెరువు కట్టలను, తూములను, అలుగులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరగడం జరిగిందన్నారు. చెరువుల సుందరీ కరణ ద్వారా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడం, చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయడంతో స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా మారింది అన్నారు.
సుందరీకరణ చేసిన వాటిని మెంటెనెన్స్ చేయడంలో ప్రభుత్వం విఫలం
బీఆర్ఎస్ ప్రభుత్వము చెరువులను సుందరీకరణ చేసి ప్రజలకు ఉపయోగకరంగా తయారు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మెయింటెనెన్స్ చేయడం చేత కావడం లేదన్నారు. చెరువులలో గుర్రపు డెక్క ఆవరించిపోయిన పట్టించుకునే నాథుడు లేడన్నారు. చెరువు వాకింగ్ ట్రాక్ చుట్టూ పిచ్చి మొక్కలు మొలసిన, చుట్టూ కంచె ధ్వంసం చేసిన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి చేయకపోగా చేసిన వాటిని రక్షించుకునే పరిస్థితి లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల అభివృద్ధిపై ఊసెత్తడం లేదన్నారు. చెరువులలో గుర్రపు డెక్క వల్ల దోమలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాలన వ్యవస్థ అంతా గాలికి వదిలేసారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాలను ధ్వంసం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిఈ వేణుగోపాల్, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, సిద్దాల బీరప్ప, మేకల రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, ప్రవీణ్, రజాక్, పంతంగి మాధవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.