MLA Sabitha | బడంగ్పేట్, ఏప్రిల్ 11: మహత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలాపూర్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. మీర్పేట్ చౌరస్తాలో దళిత, బహుజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. జ్యోతి రావు పూలే మహిళల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ఆమె గుర్తు చేశారు. విద్యకు పెద్దపీట వేసి నూతన మార్గాలను చూపించారని కొనియాడారు. వారి ఆలోచనలకే కొనసాగింపుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో 1000 గురుకులాల్ని ప్రారంభించారని తెలిపారు. అందులో 600 గురుకులాలు ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేశారని ఆమె వెల్లడించారు. దండేసి దండం పెట్టడం కాదు ఆశయాన్ని సాధించినప్పుడే ఆయనకు అదే ఘన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, సిద్దాల బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, శీను నాయక్, దీప్లాల్ చౌహాన్, అనిల్ యాదవ్, రమేష్, విజయ్, దయానంద్, మహిళా అధ్యక్షురాలు సునీత, సుర్విలత తదితరులు పాల్గొన్నారు.