MLA Sabitha | బడంగ్పేట్, మే 3 : మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజు కూడా మున్సిపల్ సమస్యలపై సమీక్ష సమావేశం పెట్టిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎస్ఎన్డీపీ పనులపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సమస్యలపై ఏ రోజు చర్చించలేదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉందన్నారు.
కనీసం ఒక్కరోజైనా మున్సిపల్ అధికారులను పిలిపించుకొని సమస్యల గురించి ప్రస్తావించాలన్న ఆలోచన లేదన్నారు. సమస్యల గురించి తెలుసుకోకుండా పరిష్కారం ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. మున్సిపల్ శాఖలో కుప్పలుతెప్పలుగా సమస్యలు ఉన్న పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో నిధులు కూడా కేటాయించడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకున్న సమస్యలను పరిష్కరించకుండా ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ అస్తవ్యస్తంగా తయారయిందని ఆమె పేర్కొన్నారు. మున్సిపాలిటీలలో ఎక్కడ చూసిన సమస్యలు తిష్ట వేసి ఉన్నాయని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కూడా అధికారుల్లో సైతం లోపించిందన్నారు. పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప అధికారులు పనులు చేసే పరిస్థితి లేదన్నారు. దీంతో మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్ లో సమస్యల వలయాలుగా మారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ఎన్డీపీ పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. వేసవి కాలంలోనే పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జల్పల్లి, మీర్పేట్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్ఎన్డీపీ పనులు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. హెచ్ఎండిఏ నుంచి నిధులు రాకపోతే జనరల్ ఫండ్ నుంచి నిధులు తీసుకొని ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయాలన్నారు.
మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆలోచనతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా పనిచేశారని ఆమె గుర్తు చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలా నగర్లో ముంపు సమస్యను చూసిన కేసీఆర్ అవసరమైన నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. శివారు ప్రాంతాలలో ఉన్న ముంపు సమస్యను పరిష్కరించడానికి 850 కోట్లు గతంలో కేటాయించడం ద్వారానే చాలా కాలనీలలో ఉన్న ముంపు సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. మిథిలా నగర్లో మరో 90 లక్షలతో నాలా పనులు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రీన్ హోమ్స్ కాలనీలో నాలా నిర్మాణం చేయవలసి ఉందన్నారు. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నామని ఆమె తెలిపారు. బడంగ్పేట్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ దగ్గర ఉన్న నాలా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఇరువు వర్గాలను పిలిపించి నాలాన్ని క్లియర్ చేయడానికి చర్చించడం జరిగిందన్నారు. వర్షాకాలం రాకముందే ఎస్ఎన్డీపీ నాలా పనులని పూర్తి చేసుకుంటే పెద్దగా ముంపు సమస్య ఉండదన్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వలన ఎస్ఎన్డీపీ పనులు మధ్యలోనే ఆగిపోవడం జరిగిందన్నారు. మహేశ్వర నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు కూడా ఆగిపోవడం జరిగిందన్నారు. ఏది ఏమైనా ఆ పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సరస్వతి, డిటి మణిపాల్ రెడ్డి, శ్యాంసుందర్, డిఈ వెంకన్న, వినీల్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.