MLA Sabitha | ఆర్కేపురం, మార్చి 24 : మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే దేశం అన్ని రంగాలలో ముందుకెళ్తుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అష్టలక్ష్మి మహిళా మండలి స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాసవి కాలనీ ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారని, కానీ నేడు మహిళలు సమాజంలో ముందుకెళ్తున్నారంటే వారి వెనకాల కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు అయిందన్నారు. అష్టలక్ష్మి మహిళా మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం గర్వించదగ్గ విషయం అన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్ కాల్వ సుజాత, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు గౌరీ శెట్టి చంద్రశేఖర్, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, సామాజిక సేవ వేత్త చిలుక మధుర ఉపేందర్ రెడ్డి, నాయకులు నేలకొండ శ్రీనివాస్ రెడ్డి, కొండ శ్రీనివాస్ , సిద్ధగోని వెంకటేష్ గౌడ్ ,రామ్ నరసింహ గౌడ్, పెంబర్తి శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి, రమేష్ కురుమ తదితరులు ఉన్నారు.