MLA Marri Rajashekar Reddy | నేరేడ్మెట్, మే 8 : ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ లేదని గుర్తించి అధికారులు ముందుకు సాగాలన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్లో అభివృద్ధి పనులపై స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఆయా విభాగాల అధికారులతో కలిసి గురువారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లోని ఆర్సీసీ బాక్స్ కల్వర్టు , పుట్బాల్ గ్రౌండ్ రోడ్డు క్రాసింగ్ నుండి బీహెచ్ఈఎల్ కాలనీ ఎగ్జిస్టింగ్ బాక్స్ డ్రైన్ లయోలా కాలేజీ రోడ్డు వరకు బాక్స్ డ్రైన్ జాయింట్ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించి వెంటనే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వివిధ కాలువల నిర్మాణాలు, విద్యుత్ సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇంజనీరింగ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శ్రీకాంత్, డీఈ రఘు, ఏఈ రవళి, జలమండలి జనర్ మేనేజర్ సునీల్, క్రిష్ణమాచారి, రమేష్, డీఈ సుబ్బారెడ్డి, ఏడీఈ రామాచారి, 33 కేవి డిఈ సపునీల్, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, అనిల్ కిషొర్ గౌడ్, లక్ష్మన్, శోభన్, పరమేష్, శ్రీనివాస్, అరుణ్, సురేష్, శరణ్ గిరి, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.