MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 13 : కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్, వెంచర్ 2.. ఎల్ఐజి ఫ్లాట్స్ గృహ సముదాయంలో లబ్ధిదారులకు అండగా ఉంటానని… హౌసింగ్ బోర్డ్ అధికారులతో మాట్లాడి ఫైనల్ కాస్ట్, వడ్డీని తగ్గించేందుకు కృషి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు కేపీహెచ్బీ కాలనీ 4వ పేజ్ వెంచర్ 2 అల్పాదయ వర్గాల గృహాల అసోసియేషన్ నేతలు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఇటీవల హౌసింగ్ బోర్డ్ అధికారులు ఎల్ఐజీ ఫ్లాట్స్ లబ్ధిదారులకు ఫైనల్ కాస్ట్, వడ్డీ డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై 2014లోనే కోర్టును ఆశ్రయించడం జరిగిందని… మరల అధికారులు ఫైనల్ కాస్ట్ వడ్డీ డబ్బులు కట్టాలని నోటీసులు జారీ చేయడం బాధాకరమని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. హౌసింగ్ బోర్డ్ అధికారులు ఆలస్యంగా నిర్మాణ పనులు చేసి.. వారి నిర్లక్ష్యానికి కొనుగోలు చేసిన లబ్ధిదారులపై భారం వేయడం తగదన్నారు. ఎల్ఐజి ఫ్లాట్స్ ధరను… నిర్ణయించిన ధరకు 63 శాతం పెంచి కట్టమని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కాలనీ నాలుగో ఫేజ్లో ఎల్ఐజి గృహాలను పేదలు కొనుగోలు చేయడం జరిగిందని… వారిపై ఫైనల్ కాస్ట్… వడ్డీల పేరుతో అదనపు భారం మోపడం బాధాకరమన్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలని కోర్టును ఆశ్రయించిన… మరల హౌసింగ్ బోర్డ్ అధికారులు నోటిసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసంమన్నారు. హౌసింగ్ బోర్డ్ ఉన్నతాధికారులు ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యనిర్వాక అధ్యక్షుడు చావా రవి, అధ్యక్షుడు పెద్దిరాజు ప్రధాన కార్యదర్శి సూరిబాబు, సిద్దు, సంతోష్, నిరంజన్ రెడ్డి పలువురు కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.