MLA Krishna Rao | ఎర్రగడ్డ, జూన్ 4 : రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బోరబండలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్తో కలిసి కృష్ణారావు సర్దార్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీకి సర్దార్ చేసిన సేవలను బీఆర్ఎస్ ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. అదే విధంగా సర్దార్ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళను వదిలి పెట్టె ప్రసక్తి లేదని కృష్ణారావు స్పష్టం చేశారు.
అరెస్టు చేయని పోలీసులు..
సర్దార్ ఆత్మహత్య వెనుక బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులు ప్రధాన కారణమని.. కానీ బాబాను పోలీసులు ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు.. పైగా ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు, పోలీసు భద్రత ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవరం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బల్దియా అధికారులతో బీఆర్ఎస్ నాయకుల ఇండ్లను కూల్చేయించటం కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 50 గజాల్లో పేద వాడు ఇల్లు కడుతుంటే బల్దియా అధికారులు అక్కడ వాలుతున్నారు.. అదే అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లను అనుమతి లేకుండా నిర్మిస్తుంటే అధికారులకు కనపడదు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులు అప్పుడు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కృష్ణారావు వెంట గౌసుద్దీన్తో పాటు సత్యం, ఐలయ్య, వీరారెడ్డి, అబ్దుల్ రహీమ్, నూర్, హమీద్, రఫీక్ తదితరులు ఉన్నారు.