MLA Krishna Rao | కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 12 : తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగితే… ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు బాల్ రెడ్డి, హనుమాన్ రెడ్డిల ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ… గత పదేళ్ల కాలంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని… హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దారన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని… రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ… శేర్లింగంపల్లి నియోజక వర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. పార్టీలో చేరిన వారిలో రాజేష్, నాగరాజు, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, దొరబాబు, రావలి, దుర్గ భవాని తదితరులు ఉన్నారు.