KP Vivekananda | హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దానం నాగేందర్ తన పరిధి మాట్లాడుతున్నారు. దానం లాగే ఇతర ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారు అనుకోవడం సరికాదు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బద్నాం చేయడం సరికాదు అని పేర్కొన్నారు.
రాజకీయాల్లో దానం నాగేందర్ చాప్టర్ ఖతం అయినట్లే అని కేపీ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలోనే ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉండటమే కాదు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే అంటారని దానం గ్రహించాలి. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చి సంపాదనలో పడ్డ దానం లాగా మేము పార్టీలు మారబోము అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద స్పష్టం చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్.. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున దానం నాగేందర్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో దానం ఓటమి పాలయ్యారు.