సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు పరిష్కారమే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన సమావేశంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ.. పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2022లో తీర్మానం చేసిన రైల్వే లెవల్ క్రాసింగ్లూ, ఆర్ఓబీల నిర్మాణం కోసం 100 శాతం ఎన్ఓసీలు తీసుకువస్తే ఇప్పటికీ ఫైళ్లకు అనుమతించలేదన్నారు.
ఇక నిరుపయోగంగా ఉన్న వార్డు ఆఫీసులను కమ్యూనిటీ హాళ్లుగా స్థానికులు ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. ఇక మచ్చబొల్లారం డివిజన్లోని సర్వే నంబర్ 198, 199లో గత హిందూ శ్మశాన వాటికలో రెండు ఎకరాల్లో డంపింగ్ యార్డు నిర్మించి రాంకీ సంస్థకు అప్పగించారు. దీంతో స్థానికులు ఇబ్బందులు పెట్టే విధంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సఫిల్‌గూడలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో నిర్మాణం వద్ద చెక్ డ్యాం వద్ద పూడిక తీయకపోవడంతో.. వెనుక ఉన్న బలరాం నగర్లో నీరు పేరుకుపోయి వెనక్కి వస్తుందన్నారు.
కానీ అటు అధికారులు కానీ, ఇటు మెగా కాంట్రాక్టర్ గానీ స్పందించడం లేదన్నారు. దీంతోపాటు మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో పారిశుధ్య కార్మికుల కొరత ఉందని, మొత్తం 476 మంది కార్మికుల్లో 100కు పైగా మంది కార్మికులు వివిధ కారణాలతో విధులకు దూరంగా ఉంటున్నారన్నారు. ఇక మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో సీఆర్ఎంపీ రోడ్ల పని, నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. ఇలా నగరంలో పేరుకు పోయిన సమస్యలతో తమ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జోనల్ కమిషనర్లు కూడా సమీక్షించడం లేదపి, కనీసం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదని, మల్కాజిగిరి అభివృద్ధికి నూతన ప్రతిపాదనలను కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అందజేశారు.