సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సబ్బండ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించారంటూ మేధావులు చెబుతున్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా డబుల్ బెడ్ రూంల నిర్మాణం నుంచి ఇంటి స్థలాల పంపిణీ వరకు, అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి అంటూ సౌభాగ్యలక్ష్మి, కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా అంటూ ఆభయమిచ్చేలా మేనిఫెస్టో ఉంది. ఆసరా పింఛన్లు, కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇలా అనేక రకాల హామీలకు ప్రజలు జై కొడుతున్నారు.
మళ్లీ సీఎం కేసీఆరేనని నినదిస్తున్నారు. మ్యానిఫెస్టో అర్థవంతంగా ఉందంటూ నగరంలో ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌లో గ్యారంటీ స్కీంలు అమలుకాక అక్కడి పాలకులు చేతులెత్తేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన నాయకుడు లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మేధావులు చెబుతున్నారు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో రూపొందించిన సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.
అన్నపూర్ణ పథకం పేదలకు వరం..
ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం ఇస్తామనడం సీఎం కేసీఆర్ ఔన్నత్యానికి నిదర్శనం. నిజంగా ఈ నిర్ణయం హర్షణీయం. తెలంగాణ అన్నపూర్ణ పథకంతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం ఆహారాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రతి పేద వారిని అక్కున చేర్చుకునే పథకాలను మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. బీఆర్ఎస్కు ప్రతి కుటుంబం మద్దతు ఉంటుంది. – ఆర్. కన్నయ్య ముదిరాజ్ (అధ్యక్షుడు, శృంగేరీ కాలనీ సంక్షేమ సంఘం)
గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం సంతోషం
అందరికీ రూ. 400కు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టడం ఎంతో సంతోషం. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను పెంచింది. సీఎం కేసీఆర్ మాత్రం తగ్గిస్తామనడం సంతోషంగా ఉంది.
– అర్చన, సహారాస్టేట్స్‌కాలనీ
అన్నపూర్ణ పథకం..హర్షణీయం..
అన్నపూర్ణ పథకం కింద రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించటం చాలా సంతోషకరమైన విషయం. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ఎవరూ సరిగ్గా తీసుకోవడం లేదు. సన్న బియ్యం ఇస్తే సంతోషంగా వండుకొని తింటారు. ప్రతి పేద కుటుంబం సన్న బియ్యంతో భోజనం చేస్తారు. దేశంలో ఎక్కడా ఇలాంటి స్కీం లేదు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు… ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేదలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. -బట్టు లక్ష్మీ, ఈస్ట్ ప్రశాంత్‌నగర్, మూసారాంబాగ్
ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం సంతోషం
సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడంతో మా లాంటి ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం లభించనుంది. శ్రీరామకాలనీలో గత 6 నెలల క్రితం బస్తీ దవాఖాన ఏర్పాటు చేశారు. చిన్నపాటి అనారోగ్యాల బారిన పడితే ఉచిత వైద్యం, మందులు అందిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ దవాఖానల్లో లక్షలు కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి రూ. 15 లక్షలకు పెంచడం హర్షణీయం. కారు గుర్తుకే ఓటు వేస్తా.
– అబ్బాస్, పహాడీషరీఫ్
అధిక ధరలతో ఇబ్బందులు పడ్డాం..
గ్యాస్ సిలిండర్ అధిక ధరలతో ఇబ్బందులు పడ్డాం. ప్రతి రెండు నెలలకు ఒకసారి రూ. 1155 పెట్టి గ్యాస్ సిలెండర్‌ను కొనుగోలు చేసేవాళ్లం. కుటంబం సంపాదనతో మోయలేని భారంతో అష్టకష్టాలు పడ్డాం. సీఎం కేసీఆర్ మంచి శుభవార్త చెప్పారు. రూ. 400కే గ్యాస్ ధర తగ్గింపుతో పెద్ద భారం తగ్గనుంది. ఆర్థికంగా ఉన్నవారు లేనివారు అందరికి పెద్ద ఊరట లభించనుంది.
– బాస అమృతమ్మ, పహాడీషరీఫ్
పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి
అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ పథకం మహిళ పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. మహిళలు ఎవరిపైనా ఆధారపడకూడదనే సంకల్పంతో ఒక పెద్దన్నగా సీఎం ఈ పథకాన్ని తీసుకురావడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో మందికి మేలు జరుగనుంది.
– అంబటి లక్ష్మీనర్సమ్మ, మన్సూరాబాద్
15 లక్షల వరకు ఉచిత వైద్యం ..
ఆరోగ్య శ్రీ పథకం పరిధిని రూ.15 లక్షలకు పెంచటం శుభ పరిణామం. వైద్యం కోసం ప్రైవేట్ దవాఖానలకు పోతే లక్షలు గుంజుతున్నారు. అనుకోని రోగం వస్తే ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే భయపడాల్సి వస్తుంది. కుటుంబానికి రూ.15 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేయటం అభినందించదగ్గ విషయం. ఆరోగ్య శ్రీ(కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం)తోనే అన్నిరకాల చికిత్సలు పొందవచ్చు. కేసీఆర్ మాటిస్తే తప్పడు.
– సత్తారం గోపాల్, మూసారాంబాగ్
సాహసోపేత నిర్ణయం..
నిరుపేదల పక్షపాతిగా పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నడు సీఎం కేసీఆర్. ఎన్నో సంక్షేమ పథకాలను రాబోయే రోజుల్లో అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడం సంతోషకరం. అందులో సింహభాగం పేదలకే లబ్ధి కలిగేలా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లే కాకుండా.. అదనంగా మరో లక్ష ఇండ్ల నిర్మాణాలను చేపడతామని సీఎం మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం పేదలకు ఎంతో ఆనందాన్నిచ్చింది. తద్వారా పేదలందరి సొంతింటి కల నెరవేరుతుంది. సీఎం కేసీఆర్ సార్‌పై సంపూర్ణ నమ్మకం ఉన్నది.
– కొత్తపల్లి వైశాలి
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలు ముమ్మాటికి ప్రజలకు మేలు చేసేవిగానే ఉంటాయి. రేషన్ కార్డుదారులందరికి ‘తెలంగాణ అన్నపూర్ణ’ పేరుతో సన్నబియ్యం, తదితర పథకాలు ఎంతో భేష్. పథకాల అమలులో తెలంగాణే మేటి. గతంలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్.
– జి.రాజేశ్ గౌడ్, సికింద్రాబాద్
కేసీఆర్ బీమా..నిరుపేదలకు ధీమా
కేసీఆర్ బీమా నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ 5 లక్షల బీమా ప్రకటించడం గర్వకారణం. గతంలో కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదల ఆశీస్సులు పొందారు. ఆయా పథకాల ద్వారా అనేక మంది ప్రజలు లబ్ధి పొందారు.
– (ప్రవీణ్‌గౌడ్, కిస్మత్పూర్ గ్రామస్తుడు)
సన్నబియ్యం ప్రకటన ఆనందం తెచ్చింది
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో రాబోయే రోజుల్లో రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు దొడ్డు బియ్యం పిల్లలు తినేందుకు అయిష్టపడేవారు. వారి కోసం ప్రత్యేకంగా సన్న బియ్యం కొనుగోలు చేసేవాళ్లం. మేం కొనుగోలు చేయకుండా నేరుగా ప్రభుత్వమే సన్నబియ్యం ఇచ్చేందుకు ముందుకు రావడం శుభ పరిణామం.
– కే.పద్మ, గృహిణి చింతల్
సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడు..
పేద,మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలంగా సీఎం కేసీఆర్ వితంతు పింఛను రూ.5016 విడుతల వారీగా పెంచుతామని ప్రకటించడం హర్షణీయం. ఏ ప్రభుత్వాలు పేదలను ఇలా ఆదుకోలేదు. సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడు అని నిరూపించుకున్నారు.
-వనితమ్మ,లాల్‌బజార్,తిరుమలగిరి
ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా..
ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించి సీఎం కేసీఆర్ పేద ప్రజలకు భరోసా కల్పించిండు. బీమా ప్రతి కుటుంబంలో ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికీ ఆపద కలిగిన ఆదుకోవటానికి ఎంతోగాను ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్న కుటుంబానికి కేసీఆర్ బీమా అండగా నిలవనుంది.
– నాగిళ్ల రమేశ్ ( సింగరేణికాలనీ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు)
సౌభాగ్యలక్ష్మి మంచి ఆలోచన
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం నిజంగా అభినందనీయం. మహిళలకు ఎప్పుడూ గౌరవం ఇచ్చే సీఎం కేసీఆర్ ఈ సారి సౌభాగ్యలక్ష్మి గురించి చెప్పడం ఆనందంగా ఉంది. ఈ పథకంతో పేద మహిళలకు ఆర్థిక సహాయం అందడం ఖాయం. బస్తీలు, కాలనీల్లో అర్హులను గుర్తించి పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలి.
-రామేశ్వరి, కార్వాన్
తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం..సంతోషం
గ్యాస్ సిలిండర్లను మధ్యతరగతి వారికి తక్కువ ధరకు అందించాలన్న ఆలోచన మంచిదే. కానీ అర్హులకు పథకం అందేలా చూడాలి. పేద, మధ్య తరగతి వర్గాల వారికి రూ.400కే గ్యాస్ ఇవ్వడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. రాష్ట్రంలో హామీలను ఇవ్వడం, నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్‌కే చెల్లింది.
-తులసి(లంగర్‌హౌస్)
బీమా సదుపాయం వరం..
ఉచితంగా 5 లక్షల బీమా సదుపాయం కల్పించడం నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరం. కుటుంబాన్ని పోషించే ఇంటిపెద్ద ఏదైనా అనుకొని ఘటన జరిగి మరణిస్తే ఆ కుటుంబం అప్పులపాలు కాకుండా ఈ బీమా సొమ్ము ఆదుకుంటుంది. నిరుపేదల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని 15 లక్షలకు పెంచడం వల్ల పేదలకు ఆరోగ్య సేవలు పొందే అవకాశం కల్పించారు. ఇది చాలా అద్భుతమైన మ్యానిఫెస్టో.
– ముక్కా శ్రీనివాస్, బోయిగూడ