KCR | హైదరాబాద్లో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగించేశారు. కొన్నిచోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లను చించేశారు. కానీ వాటి పక్కనే ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోస్టర్లను మాత్రం అలాగే వదిలేశారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను అస్సలు ముట్టుకోలేదు.
కేసీఆర్ ఫ్లెక్సీలపై హైడ్రా అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎక్కడ కనబడ్డా వెంటనే తీసేయాలని తెలంగాణ సీఎంవో నుంచి డైరెక్ట్ ఆదేశాలు వచ్చాయని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. సీఎంవో నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి తీసేస్తున్నాం.. మమ్మల్ని ఏం చేయమంటారని వాపోతున్నారు.
కాగా, కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ , బ్యానర్లను తొలగించడంపై బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకుడు జై సింహా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన విడిచిపెట్టి.. బీఆర్ఎస్ను అణిచివేయాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలోపేతం అవుతుందని చెప్పారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.