దుండిగల్: కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి బుద్ధి చెబుతారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయమై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవినీతి రంగు పులుముతూ పీసీ ఘోష్ నివేదికపై విచారణను సీబీఐకి అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు పిలుపు మేరకు సోమవారం షాపూర్‌నగర్‌లోని ఉషోదయా చౌరస్తా వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. సమైక్యపాలనలో బీడుబారిన తెలంగాణ ప్రాంతాన్ని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో సశ్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకే ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయన్నారు. కాళేశ్వరంపై నివేదిక ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్ కాదని, అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఘోష మాత్రమేనన్నారు.