బంజారాహిల్స్,అక్టోబర్ 26: అన్నా అంటే నేనున్నా ..అంటూ నిరంతరం మీతోనే ఉంటూ ‘గోపన్న‘గా మీ గుండెల్లో చోటు సంపాదించుకున్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చూపిన బాటలోనే తాను కూడా ప్రయాణిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ భరోసా ఇచ్చారు. రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో మాజీ కార్పొరేటర్ షఫీతో పాటు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాగంటి సునీతాగోపీనాథ్కు బస్తీవాసులు అపూర్వ స్వాగతం పలికారు.
ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నుంచి తాము పొందిన సాయం గురించి చెప్పుకుని కన్నీళ్లపర్యంతమయ్యారు. తమకు ఏ కష్టమొచ్చినా గోపన్నా అంటూ ఫోన్ చేసేవాళ్లమని, అప్పటికప్పుడు స్పందించి తమకు అండగా నిలిచేవారని గుర్తు చేసుకున్నారు. రానున్న ఉప ఎన్నికలో గోపన్న కోసం బీఆర్ఎస్కు ఓటేస్తామని, కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎవరూ ఇవ్వలేదని ఓటర్లు చెప్పడం విశేషం. తాను కూడా గోపీనాథ్ బాటలోనే నడుస్తానని నిత్యం జనంలోనే ఉంటానని, జూబ్లీహిల్స్ ప్రజలే తమ కుటుంబంగా భావిస్తున్నామని మాగంటి సునీతా గోపీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
బస్తీల్లో నేతల ప్రచారం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఆదివారం బీఆర్ఎస్ నేతలు,మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం పలు బస్తీల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ డివిజన్ పరిధిలోని రాజ్నగర్తో పాటు పలు బస్తీల్లో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కుమార్ ,బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు గుజ్జ యుగేంద్రావు, నేవూరి ధర్మేందర్రెడ్డితో పాటు పలువురు నేతలు మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.