రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని.. 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు. రైతులు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి ఉరితీయగా, మరికొన్ని చోట్ల పిండ ప్రదానం చేశారు. రైతులపై కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలన నుంచి నేటి వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రథమ శత్రువుగా మారిందని దుమ్మెత్తి పోశారు.
కరెంటు అడిగితే కాల్చి చంపిన చంద్రబాబునాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి రైతులను ముంచేలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను బయట పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేస్తుంటే.. రైతు వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ను పాతరేస్తామని హెచ్చరించారు. ఇది కాంగ్రెస్ విధానం కాకపోతే వెంటనే రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నారు.