మారేడ్‌పల్లి, జూలై 11: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. మంగళవారం కంటోన్మెంట్ 7వ వార్డు ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద విద్యుత్ స్తంభానికి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను వేలాడదీసి గుడ్లతో కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ… తన జల్సాల కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న విద్యుత్ సరఫరాపై అనుచిత వ్యాఖ్యనాలు చేయడం సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందు, ఈశ్వర్, సునీత, బి. రాజు, శ్రీను, రాజు, గణేశ్, శేఖర్, మోని, రఘు, నాగరాజు, కిట్టు, రాకేశ్‌చారి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి
రంగారెడ్డి జిల్లా కోర్టులు, జూలై 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ కేటాయించవద్దంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీఆర్ఎస్ లీగల్‌సెల్ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తూ, పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతుబీమా అందించి దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తూ రైతు ముఖం ఆనందంగా ఉంటే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ లీగల్‌సెల్ నాయకులు కొంతం గోవర్ధన్‌రెడ్డి, వొద్యారపు రవికుమార్, కందుకూరి నర్సింహాచారి, సిక్కుల్ల భిక్ష్మయ్య, రామాచారి, జొన్నాడ రాకేశ్‌కుమార్, ప్రసన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
బీఆర్ఎస్ నేత పీఎల్ శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ రైతులు ఎదిగారని బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ అన్నారు. కానీ 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధును కూడా వద్దంటాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లోకి..
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నందకిశోర్ వ్యాస్ బిలాల్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి ఆయన పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బంజారాలపై కాంగ్రెస్ విధానం తెలపాలి
ఓయూలో రేవంత్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 11: బంజారాలపై కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని బహిర్గతం చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. స్వల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న ఆదివాసీల కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో ఓట్లు ఉన్న లంబాడీలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. బంజారాలపై రేవంత్ నిర్లక్ష్యానికి నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రేవంత్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ.. ఆదివాసీల ఓట్ల కోసం ఎమ్మెల్యే సీతక్కను రేవంత్‌రెడ్డి సీఎం చేస్తానని ప్రకటించారని ఆరోపించారు. సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లంబాడీలకు ఏమి చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు గోపాల్ నాయక్, నవీన్ నాయక్, సంతోష్ నాయక్, కిరణ్ నాయక్, భాగ్యనాయక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
మండిపడుతున్న తెలంగాణ సమాజం
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి
మలక్‌పేట, జూలై 11 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్రంగా మండిపడుతున్నదని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ చౌరస్తాలోని వికలాంగుల కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మూడెకరాలున్న రైతులకు 3గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని, 24 గంటలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చిన్న, సన్నకారు రైతులపై విషం చిమ్మడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించి రైతుల కన్నీళ్లు తుడిచిన రైతుబిడ్డ కేసీఆర్ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
రైతు వ్యతిరేకి కాంగ్రెస్
టీఎస్టీఎస్ చైర్మన్ జగన్మోహన్రావు
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా తానా సభలో చేసిన వ్యాఖ్యలపై టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు ఇస్తున్న నిరంతర ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన రేవంత్‌రెడ్డిది అని, ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్న నేతల నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లుగా రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, అందుకే సీఎం రైతు బాంధవుడిగా నిలిచారని ఆయన అన్నారు. రైతులకు ఎప్పటికైనా సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 11: తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ రైతులు ఆర్థిక పురోభివృద్ధి చెందుతుంటే రేవంత్‌కు కండ్ల మంటగా ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలిచి, అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుందని ధ్వజమెత్తారు.
రాజకీయాల్లో రేవంత్‌ది శిఖండి పాత్ర
బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 11 : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్‌రెడ్డిది శిఖండి పాత్ర అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులను ఆదుకుంటుంటే తెలంగాణ ద్రోహులకు కంటగింపుగా మారిందని దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలో కూడా తెలంగాణ కీర్తిని తక్కువ చేసి మాట్లాడుతున్న రేవంత్‌కు తెలంగాణ రైతన్న చేతిలో చావుదెబ్బ తినక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రైతులకు వెంటనే రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.