మన్సూరాబాద్, మే 9 : శ్రీకాంతాచారి మరణానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి దండలు వేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతుందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సోమవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి మలీనం చేశారని ఆరోపిస్తూ గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రాంనర్సింహా గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.రాజీవ్‌సాగర్, ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వకుండా ఏండ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడంతోనే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడని, అందుకు కారకులే రకరకాల ముసుగులు ధరించి ప్రజల మధ్యకు వస్తున్నారని ఆరోపించారు.
హత్యలు చేసే కాంగ్రెస్ నాయకులే.. అమరుల కుటుంబాల వెంట మేమున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం అమరులైన ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూ.10 లక్షలతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారని తెలిపారు. ఉద్యమకారులపై కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి గుర్తుగా నగరంలో అమరవీరుల స్ఫూర్తి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. జూన్ 1న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. ఆంధ్రాలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని బీజేపీలోకి పంపుతానని చంద్రబాబు నాయుడు బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ అమ్మేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైపు ఉండాలో.. కాంగ్రెస్, బీజేపీ దొంగల వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాగిరి ఉదయ్‌గౌడ్, ఉప్పల శివకుమార్, గౌరి తదితరులు పాల్గొన్నారు.