Bonalu Festival | మెహిదిపట్నం, జూన్ 27 : చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయ బోనాల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం గందరగోళంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం లంగర్ హౌస్ బస్తీ వాసులకు అవమానాన్ని మిగిల్చింది. గోల్కొండ బోనాల ప్రారంభ కార్యక్రమంలో లంగర్ హౌస్లో ఏర్పాటు చేసే వేదికపై రాజకీయ పార్టీలకు అతీతంగా గోల్కొండ ఆలయ మాజీ చైర్మన్లను, బస్తీ నాయకులను, ప్రభుత్వ శాఖల అధికారులను పిలిచి సన్మానించడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి భిన్నంగా వేదికపైకి ఎవరిని పిలవకుండా కార్యక్రమం పూర్తి చేశారు.
గురువారం వేదికపై జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులతో పాటు కేవలం 6 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉండడం గమనార్హం. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల అధికారులను కూడా వేదికపైకి పిలువలేకపోయారు. వేదిక కింద పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేసి ఎవరిని పైకి రాకుండా చేశారు. ఈ క్రమంలో అయోమయానికి గురైన కమిటీ సభ్యులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. జలమండలి, విద్యుత్, జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులందరూ వేదిక కింద సుమారు రెండు గంటల పాటు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కూడా ఈ సందర్భంగా విస్మరించారు. దీంతో బోనాల ప్రారంభోత్సవ కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. లంగర్ హౌస్ బస్తీకి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రస్తుత కమిటీ తీరుపై మండిపడుతున్నారు. బోనాల పండుగ కార్యక్రమమా.? లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.