సిటీబ్యూరో, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ప్రభుత్వశాఖల లోగోలు వాడుతూ వాటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడం ఒక్క హైడ్రాకే చెల్లింది. సాక్షాత్తు హైడ్రాలోగో వాడుతూ హైడ్రావారియర్స్ పేరుతో ఎక్స్ వేదికగా కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతూ పోస్టులు పెట్టిన వారిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలాంటి చర్యలూ తీసుకోరట. కేవలం వారెవరో తెలుసుకుని మందలించి వదిలేసినట్లు సమాచారం.
ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని ఇదంతా సోషల్ మీడియాలో వార్ తప్ప మనకేం సంబంధమంటూ కమిషనర్ తమ సిబ్బందితో అన్నట్లు తెలిసింది. అయితే సోమవారం నుంచి ఈ వ్యవహారంపై బీఆర్ఎస్తో పాటు నెటిజన్లు మండిపడుతున్నా కమిషనర్ రంగనాథ్ హైడ్రావారియర్స్తో తమకు సంబంధం లేదని, తాము రాజకీయాలకు అతీతమంటూ తమ అఫీషియల్ హ్యాండిల్‌పై పోస్ట్ చేశారు.
నకిలీ ఖాతాపై చర్యలు తీసుకోవాలి..
హైడ్రా పేరుతో అనధికారికంగా, ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హైడ్రా వారియర్స్ ఎక్స్ ఖాతా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ తరపున ఆశిష్‌కుమార్ యాదవ్, గోవర్దన్ రెడ్డి తదితరులు మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
హైడ్రా పేరుతో నకిలీ ఖాతా నిర్వహిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పూర్తిగా నిష్పాక్షికంగా ఉండాలని, కానీ హైడ్రా పేరుతో ఉన్న ఈ ఖాతాలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని వారు పేర్కొన్నారు. హైడ్రా టీజీ పేరుతో వారు సృష్టించిన ఖాతాతోనే వాట్సప్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నడుస్తున్నాయని, అంతేకాకుండా వారు ఉపయోగిస్తున్న ఫోన్‌నెంబర్ కూడా హైడ్రా తెలంగాణ అంటూ వస్తున్నదని , దీనిపై కమిషనర్ దృష్టి సారించి బాధ్యులపై చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.