సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు వ్యతిరేకంగా ట్యాంక్ బండ్ వద్ద డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ట్యాంక్‌బండ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలను అక్రమంగా అరెస్టులు చేయడంతో పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను అడుగడుగునా గృహ నిర్బంధం చేశారు. ప్రజాపాలన పేరుతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను అక్రమంగా నిర్బంధించడం దేనికి సంకేతమని, అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి.. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం పలకాల్సింది పోయి..నిర్బంధం చేయడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే…కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఇబ్బందులు పెడుతున్నదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన విధంగా గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఎందరినీ నిర్బంధించినా.. ప్రజలకు అండగా ఉండి పోరాడుతుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశారు.