బేగంపేట్/బన్సీలాల్‌పేట్, ఏప్రిల్ 14 : అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహానికి తలసాని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ప్రొత్సాహం అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ఆయన నిజమైన దళిత ఆత్మబంధువుగా నిలిచారని అన్నారు. ప్రపంచం మెచ్చుకున్న అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ప్రపంచ మేధావిగా కీర్తి గాంచిన అంబేద్కర్ కలలు గన్న కులవివక్ష లేని సమసమాజం నిర్మాణం జరగాలని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని అన్నారు.