బన్సీలాల్‌పేట్, ఆగస్టు 30: కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అధికారంలోకి రాగానే బీసీలను కాంగ్రె స్ మోసగించాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ నేత, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్‌లు ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం వారిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్, జైస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ రావు,
బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు నారాయణ గౌడ్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, ఇన్చార్జి కె.వెంకట్ గౌడ్, బీసీ ఆజాది సంఘ్ అధ్యక్షుడు డి.మహేశ్ గౌడ్, కార్యదర్శి విజయ్ కుమార్, అంబేద్కర్ అజాదీ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరిలు పరామర్శించి, తమ సంఘీభావం తెలిపారు. అనంతరం, వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిలు ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం కోటా ఇచ్చాకనే ఎన్నికలకు వెళ్ళాలని డిమాం డ్ చేశారు. వెంటనే సమగ్ర బీసీ జనాభా గణన చేపట్టాలన్నారు.
అడ్డగుట్ట: మాయమాటలతో సీఎం రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని విశ్వకర్మ సీనియర్ నాయకులు రుద్రోజు శివలింగం అన్నారు. బీసీ కుల గణన చేసి 42 శా తం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ నాయకులు సిద్ధేశ్వర్, సంజయ్ కుమార్‌లు ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే, వీరి దీక్షను పోలీసులు భగ్నం చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయినా కూడా వారిద్దరు గాంధీ ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న రుద్రోజు శివలింగం శుక్రవారం వారిని ఆసుపత్రిలో కలిసి దీక్షకు మద్దతు తెలిపారు. శివలింగం మాట్లాడుతూ, ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి మాట మార్చారని అన్నారు. రేవంత్‌రెడ్డి హామీని అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, మాట తప్పిన రేవంత్ బీసీల ద్రోహి అని ఆయన తెలియజేశారు.