బాలానగర్, జూన్ 12 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి వార్డు కార్యాలయ ప్రాంగణంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఓల్డ్‌బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓల్డ్‌బోయిన్‌పల్లి, హస్మత్‌పేట డివిజన్లకు చెందిన ప్రజలు భారీగా సమస్యల వినతి పత్రాలు అధికారులకు అందజేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు సమస్యలు తెలియజేయడం కోసం భారీగా తరలిరావడంతో అధికారులు అవాక్కయ్యారు. ప్రధానంగా శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, డ్రైనేజీ వ్యవస్థ పేరుకుపోయిందని, తాగునీరు సక్రమంగా రావడం లేదని, రోడ్లు వేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బోయిన్పల్లి సర్కిల్ అధికారులు విఫలం చెందారని అన్నారు. బోయిన్పల్లి సర్కిల్ ఏర్పాటైనప్పటి నుంచి అధికారుల సమాచారం తెలియడం లేదన్నారు. అధికారులకు ఎమ్మెల్యేను కలిసే అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. అధికారుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో ఏ విభాగంలో ఏ అధికారి పని చేస్తున్నారు, ఏఏ డివిజన్లో ఎవరు పని చేస్తున్నారని తనకు సమగ్ర సమాచారం అందజేయాలని సూచించారు. వార్డు కార్యాలయం ప్రాంగణంలో అన్ని విభాగాల అధికారులకు చెందిన పూర్తి సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
సర్కిల్ కార్యాలయాన్ని బోయిన్‌పల్లిలోనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. బోయిన్‌పల్లిలో అనువైన ప్రాంతం లేదని అధికారులు వ్యక్తం చేస్తున్న వాదనను ఆయన తోసి పుచ్చారు. వార్డు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఇతర కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలించి సర్కిల్ కార్యాలయానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేయిస్తామని పేర్కొన్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి, హస్మత్‌పేట, ఫతేనగర్, ప్రకాశ్‌నగర్, మోండా మార్కెట్ డివిజన్లున్నాయని తెలిపారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి, హస్మత్‌పేట, ఫతేనగర్ డివిజన్లలో వ్యర్థాలను తొలగించని కారణంగా కంపు కొడుతుందన్నారు. రాంఖీ సంస్థ వారు వ్యర్థాలను తీసుకుపోవడానికి వాహనాలను పంపక పోతే వారిని బ్లాక్ లిస్లో పెట్టి ప్రజా సమస్యలను గుర్తించి మరో సంస్థకు అవకాశం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీ డాకు నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, వి ద్యుత్ ఏఈ సౌందర్య, ఏఈ వరుణ్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ తిరుమలయ్య, బీఆర్ఎస్ నా యకులు జంగయ్య, లావణ్య, నరేందర్‌గౌడ్, బల్వంత్‌రెడ్డి, సయ్యద్ ఎజాజ్, హరినాథ్, లలిత, ఉదయరాణి, సరోజ పాల్గొన్నారు.
హస్మత్‌పేట అంజయ్యనగర్ సమీపంలోని సర్వే నంబర్ 57లోని 9 ఎకరాల స్థలం కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. అలాంటి ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు సర్వేనంబర్ 157/1 మార్చి బోర్డులు ఏర్పాటు చేసి బౌండరీలు ఏర్పాటు చేయడం రౌడీలతో కాపలా కాయించడం బాధాకరమన్నారు. గతంలో బాలానగర్ మండల పరిధిలో ఉందని రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ తన వద్ద ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలం తిరుమలగిరి మండలంలోకి ఎలా మారిందో రెవెన్యూ అధికారులు స్పష్టం చేయాలన్నారు. గ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేత గజ్జెల నగేశ్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నపుడు సర్వేనంబర్ 57 గా ప్రభుత్వ స్థలంగా ఉన్నప్పుడు సీఎం కాగానే సర్వే నంబర్ మారి పోవడం.. ప్రభుత్వ స్థలం ప్రైవేటు స్థలంగా మారడం చూస్తుంటే పలు అనుమానాలు తలెత్తున్నాయని విమర్శించారు.