హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. సీబీఐ విచారణ తెలంగాణకు వచ్చే వందేళ్ళు నష్టం చేసే కుట్ర అని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి,
బండి సంజయ్ విషం చిమ్మారని ఆరోపించారు. కిషన్ రెడ్డి లేఖతో ఎన్డీఎస్ఏ వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టకుండా కేసులు వేసిన చంద్రబాబు కుట్ర సీబీఐ విచారణ వెనుక ఉందని మండిపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘పీసీ ఘోష్ కమిషన్ రూ.6 కోట్లు రికవరీ చేయాలని చెప్పింది. 20వ నంబర్ పిల్లర్ గురించి అడగవద్దని కమిషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లపై ఏసీబీ కేసులు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా అధికారులు ఎవరూ మాట్లాడవద్దని రేవంత్ రెడ్డి అధికారులను బెదిరించారు. పీసీ ఘోష్ కమిషన్ మహాదేవ్ పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఎందుకు విచారణ చేయలేదు..? విజిలెన్స్ రిపోర్టులో 18 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చింది’ అని ఆరోపించారు.
‘సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పాల్వాయి హరీష్ డాక్టరేట్‌పై అనుమానం ఉంది. పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్లో హాస్పిటల్ పెట్టి పేద ప్రజలను దోచుకుంటున్నారు. మహాదేవ్‌పూర్ పీఎస్‌లో వచ్చిన ఫిర్యాదుపై రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేయాలి. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలపై సిట్ వేయాలి. అమృత్ టెండర్ల కుంభకోణంపై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. డీపీఆర్ లేని కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై, 600 కోట్ల కోడిగుడ్ల స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి’ అని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
‘తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఏపీకి దోచిపెడుతున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ సాయంతో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని మోదీ చూస్తున్నారని రాహుల్ గాంధీ దేశం మొత్తం చెబుతున్నారు. రాహుల్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నారు. గోదావరి జలాలపై తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే కుట్ర జరిగింది. మోదీ, చంద్రబాబు స్క్రిప్టును రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది’ అని చెప్పారు.
కాగా ఈ ప్రెస్ మీట్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇంతియాజ్ అహ్మద్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీ ఆర్ఎస్ నేతలు ఆజం అలీ, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.