అల్లాపూర్, నవంబర్1: మైనారిటీ నాయకుడు సర్దార్ మరణానికి కారణమైన బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసి , విచారణ ఎందుకు చేయడంలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్‌ను నిలదీశారు. శనివారం సర్దార్ తల్లిదండ్రులతో కలిసి బోరబండ పోలీసుస్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ వేధింపులతో సర్దార్ మూడంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
ఆయన మరణానికి బాబానే కారణమని కుటుంబసభ్యులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేసుకున్నారని తెలిపారు. సర్దార్తో బాబా ఫసియుద్దీన్ మాట్లాడిన 20 నిమిషాల ఫోన్ సంభాషణలో.. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే నీ షాపులో గంజాయి ప్యాకెట్లు పెట్టి నీ పై పోలీసు కేసు బనాయిస్తానంటూ.. బాబా సర్దార్‌ను బెదిరించడం రికార్డులో ఉందన్నారు. అయినా పోలీసులు బాబా పై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు అధికార కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తున్నారన్నారు. సర్దార్ లాంటి సామాన్యులు 50,100 గజాల్లో ఇండ్లు కట్టుకుంటే బాబా వంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు హైడ్రాను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు.
ఓ వ్యక్తి మరణానికి కారణమైన నిందితుడికి కాంగ్రెస్ ప్రభుత్వం గన్మెన్లను ఇచ్చి ప్రజల్లోకి వదిలారన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న తమకు ఏ ఇంట్లో వ్యక్తిని కదిలించిన బాబా వేధింపులు ఎక్కువయ్యాయని,కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే సర్దార్కు పట్టిన గతే మీకూ పడుతుందని బెదిరిస్తున్నాడని బాధితులు చెబుతున్నారన్నారు. అలాంటి వ్యక్తిని ప్రచారంలో మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు వెంటేసుకొని తిరగడం వల్ల ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదని ప్రజలను హింసించే రౌడీల పాలన అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులు సర్దార్ మరణానికి సంబంధించిన కేసు విచారణ వేగవంతం చేసి బాబాను అరెస్టు చేయడంతో పాటు రౌడీషీట్ తెరువాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
హైడ్రా పేరుతో వేధింపులు..
హైడ్రా పేరు చెప్పి సామాన్యులను కాంగ్రెస్ నాయకులు వేధిస్తున్నారని,అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ..ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ మండిపడ్డారు. బోరబండ లాంటి పేదలున్న ప్రాంతాల్లో 40,50గజాల్లో ఇండ్లు కట్టుకుంటున్న పేదల పై ప్రతాపం చూపిస్తున్న హైడ్రా.. పెద్దల జోలికి వెళ్లకుండా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ క్రమంలో బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ హైడ్రాను అడ్డం పెట్టుకుని ఇండ్లు కట్టుకుంటున్న పేద ప్రజలను వేధిస్తూ అక్రమంగా వసూళ్లు చేస్తున్నాడన్నారు. అదే విధంగా సర్దార్ మరణంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారన్నారు. తమ కొడుకు మరణానికి కారణమైన బాబా పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని సర్దార్ తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బోరబండలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో వాడవాడలా బాబా ఆగడాల పై బాధితులు తమ గోడును చెప్పుకుని బాధపడుతున్నారని తెలిపారు.