హైదరాబాద్ జూలై 11 (నమస్తేతెలంగాణ): ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కపట ప్రేమను కనబరుస్తున్నదని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. గతంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, కుక్కల బెడదను అరికట్టాలని, చెత్తను తరలించాలని, వీధి దీపాలను అమర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు ఆగమేఘాలపై అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. తెల్లారి లేస్తే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల మందీ మార్బలంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తుండటాన్ని చూసి ఈ ప్రాంత ప్రజలు నోరెళ్లబెడుతున్నారని, ఇంతకాలం లేని ప్రేమ ఇప్పుడెందుకు పుట్టుకొచ్చిందని నవ్వుకుంటున్నారని చెప్పారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో అన్నింటా ముందున్న నగరం.. కాంగ్రెస్ పాలనలో సర్వనాశనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధమేలేని కార్మిక, వ్యవసాయ శాఖ మంత్రులు, సొంత డివిజన్‌ను నిర్లక్ష్యం చేస్తున్న మేయర్ విజయలక్ష్మి జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు పూయడం తప్ప..సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరతతో రైతాంగం ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు జూబ్లీహిల్స్‌ను ఉద్దరిస్తానని చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదని విమర్శించారు. తుమ్మల చెప్పినట్టు జూబ్లీహిల్స్ ప్రజలు తెలివైన నిర్ణయమే తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ నేతల సీజనల్ డ్రామాలు తెలియనంతా అమాయకులు జూబ్లీహిల్స్ ప్రజలు కారని స్పష్టంబ చేశారు. వారి పర్యటనలు వృథా ప్రయాస కాక తప్పదని తేల్చిచెప్పారు. ఉప ఎన్నిక ఎప్పుడొవచ్చినా కచ్చితంగా జూబ్లీహిల్స్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.