Karthik reddy | మణికొండ, మార్చి 8 : సమాజంలోని ప్రతి కుటుంబానికి మహిళ వెలుగునిచ్చే జ్యోతి అని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. శనివారం ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మణికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రూపా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి ఇప్పటికీ ఎప్పటికీ మహిళ వెలుగునిచ్చే జ్యోతి అని, మహిళలేని చోట అంధకారమే దర్శనమిస్తోందని ఆయన అన్నారు. మహిళలను సంపూర్ణంగా గౌరవించుకునే దేశం మనదని అలాంటి దేశంలో మహిళగా పుట్టడం నిజంగా వారి పూర్వజన్మ సుకృతమైన అని అన్నారు. మహిళను గౌరవించుకున్న చోట దేవతలు ఉంటారని ఆనాటి నుంచే మన పెద్దలు మనకు తెలిపారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ మన దేశంలో మహిళను ఎప్పటికీ ప్రథమ పౌరులుగానే గౌరవించుకుంటామని అది కుటుంబం అయినా మరే ఇతర సందర్భాలలోన మహిళ లేనిదే ఏ కార్యక్రమం ప్రారంభానికి నోచుకోదని గుర్తు చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మణికొండలో ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు.
అనంతరం మహిళలు ఆటపాటలతో పాటు ఫ్యాషన్ షో, సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ్ల, నార్సింగి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కే విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు గుట్ట మీద నరేందర్, మాల్యాద్రి నాయుడు, మల్లేష్, విట్టల్, మహిళా నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.