Manne Krishank | హెచ్సీయూ అంశంలో సోషల్మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ గచ్చిబౌలి పోలీసులు తనకు నోటీసులు పంపించడంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ చేయడం ప్రారంభించిందని తెలిపారు. తాను చేసిన పోస్టుల్లో ఎక్కడా కూడా ఏఐని వాడలేదని స్పష్టం చేశారు. ఇటీవల హెచ్సీయూ విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు అన్నీ వాస్తవమే అని పేర్కొన్నారు. దీనిపై న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.
జింకలు ఎందుకు రోడ్ల మీదకు వచ్చాయి.. ఇళ్లలోకి ఎందుకు వెళ్లాయి.. అవన్నీ వీడియోలు ఉన్నాయని క్రిశాంత్ తెలిపారు. అక్కడ జింకలు లేవు, నక్కలు ఉన్నాయని అంటున్నారని విమర్శించారు. కంచె గచ్చిబౌలి భూముల్లోకి ఎవరూ రావవద్దని ఆంక్షలు పెట్టారని.. ఇప్పుడు ఏఐతో వీడియోలు సృష్టించారని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు ఏఐ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు. నిజంగానే అక్కడ జింకలు, నెమ్మళ్లు ఉన్నాయని జాతీయ స్థాయిలో నిరూపితమైందని తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై నాలుగు కేసులు పెట్టిందని విమర్శించారు.
జింకలు చనిపోవడానికి కారణమెవరు? ఆ చెట్లను నరకడానికి కారణం ఎవరని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. వీటికి కారణం ఎవరైనా వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ జింకలు లేవని అందరితో వీడియోలు పెట్టిస్తున్నారని.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు ఇచ్చి రీల్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు.