రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మడం అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ ప్రభుత్వం ప్రయత్ని్స్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి నిరసన దీక్షలు చేపట్టారు. తెలంగాణను దోచుకుంటున్న దండుపాళ్యం ముఠా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హిల్ట్ పాలసీని రద్దు చేయాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను మధుసూదనాచారి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌కు అనేక కంపెనీలు క్యూ కట్టాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రపంచంతోనే పారిశ్రామికరంగంలో పోటీపడ్డామని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నారని అన్నారు.
HILT పాలసీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మౌలాలి పారిశ్రామిక వాడలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు pic.twitter.com/tAQJDnGoJu
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025
తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ జాతిని అవమానించడమే కాంగ్రెస్ విధానమని విమర్శించారు. కాంగ్రెస్ విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నమ్మించి మోసం చేస్తుందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలను నరకం చూస్తున్నారని అన్నారు. కమీషన్ల కోసం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కప్పం చెల్లించడం కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి అమాయకులు కాదని.. రేవంత్ మోసాలు గమనిస్తున్నారని అన్నారు.