Madhavaram Narasimha Rao | వనస్థలిపురం, ఏప్రిల్ 11 : లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ యూత్ జిల్లా ఇన్చార్జి మాధవరం నర్సింహ్మారావు హెచ్చరించారు. శుక్రవారం బీఎన్‌రెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడ్డదారిలో, మోసం చేసి కార్పొరేటర్ అయిన దర్పల్లికి హరీష్‌రావును విమర్శించే స్థాయి లేదన్నారు. లింగోజి గూడ దివంగత కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మరణిస్తే తాము పోటీ చేయకుండా ఉన్నామన్నారు. ఏకగ్రీవం చేసేందుకు తానే ముందుంటానని చెప్పిన దర్పల్లి మోసం చేసి పోటీలో ఉన్నాడన్నారు. అటు ఆకుల రమేష్ కుటుంబాన్ని, ప్రజలను మోసం చేశాడన్నారు. తనకు తానే పెద్ద లీడర్‌గా భావిస్తున్నాడని, దర్పల్లికి కార్పొరేటర్ స్థాయి కూడా లేదన్నారు. మూడు పర్యాయాలు మంత్రిగా పని చేసి, నిరంతరం ప్రజల్లో ఉండే హరీష్‌రావుపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు నల్ల శ్రీనివాస్‌రెడ్డి, మేకల శ్రీకాంత్, చేగోరి భాస్కర్, సాయి, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.