హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘ముల్లును ముల్లుతోనే తియ్యాలె, ఓటుతోనే కాంగిరీసుకు బుద్దిచెప్పాలె’ అని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కేతమ్మ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో శనివారం కేటీఆర్ సమక్షంలో షేక్‌పేట బీజేపీ, కాంగ్రెస్ నేతల చేరిక కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు, కేసీఆర్ వీరాభిమాని కేతమ్మ తనదైన శైలిలో ప్రసంగించి శ్రేణులను ఊర్రూతలూగించారు. తెలంగాణ యాసలో కేసీఆర్ కాంగ్రెస్ పాలనకు తేడాను విడమరిచి చెప్పారు. ఆమె తన ప్రసంగంలో ఆద్యంతం పంచ్‌లు, ప్రాసలతో మాట్లాడిన తీరు అక్కడికి వచ్చిన పార్టీ నాయకులను ఆలోచింపజేసింది.
ఆమె మాటల్లోనే.. ‘సార్ జెప్పినట్టు ముల్లుతోటి ముల్లే తీయాలి.. వజ్రంతోటి వజ్రమే కోయాలె.. పెద్దపెద్ద మాటలు కాంగ్రెస్సోళ్లు మాట్లాడిన్రు.. ఇయ్యాల గాదు.. అయ్యాలగాదు.. ఇది రొండేళ్ల కాంగిరీసు కాదు.. అరువై ఏండ్ల సంది సూత్తూనే ఉన్న.. అయినా కట్టె ఇరగలే, పాము సావలె.. ఓ& ఎంత మంది కాంగిరీసు లీడర్లు పోయిరి.. చెన్నయ్య పాయే.. రోశయ్య పాయే.. రాజశేఖర్‌రెడ్డి పాయే.. ఇందిరమ్మ పాయే.. సుధీర్‌రెడ్డి పాయే.. ఇడేవడో ఇన్చార్జోడు కిషన్‌కుమార్‌రెడ్డి పాయే.. ఎవ్వడు వచ్చినా గాడనే ఉన్నది.. దోచుకతినుడే కాంగ్రెస్ కొడుకుల పని.. ఈ రెండేళ్లలో ఎక్కడ జూసినా ఏం లేదు..
కాలం సక్కగలేదు.. చెరువుల్ల, బావుల్ల, బోర్లల్ల నీళ్లు లేవు.. రైతులు సచ్చిపోయిరి.. ఆత్మహత్యలు చేసుకునిరి.. ఆడోళ్లు ఆగమైరి.. అడ్డికి పావు సేరుకు చెలుకలు, పొలాలు అమ్ముకొనిరి.. రైతులు వలసకూలీల లెక్క దేశాలు పట్టిన్రు.. రాజ్యాలు పట్టిన్రు.. రైతులు, జనం ఆగమైన్రు.. అయ్యాల కేసీఆర్.. తెలంగాణ నిధులు, నీళ్లు పోతున్నయ్.. కొలువులు పొతున్నయ్.. ఆంధ్రోళ్లు తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్రని.. కేసీఆర్ ఒక్కడే ఒక్కడు.. బలవంతుడు, బుద్ధిమంతుడు.. పట్టుదలతో ప్రత్యేక తెలంగాణ తెత్తనని ఆలోచనజేసిండు.. పదులు పోయి వందలైండ్రు.. వందలు పోయి.. వేలు.. లక్షల జనాలైన్రు.. ఆయన వెంట వేలకు వేలు కదిలి ఉద్యమాలు చేసిన్రు. కేసీఆర్ తల్వార్లు పట్టలె..
ఫిరంగులు పట్టలె.. తుపాకులు పట్టలె.. బక్కచిక్కిన మనిషి.. మన నీళ్లు, నిధులు ముట్టకుండా ఎల్లెలుకల పండుకుండు దవాఖాన్ల.. చచ్చిపోయిండన్నరు పబ్లిక్.. పైకి పోయిండు.. యమధర్మరాజుతోటి కొట్లాడిండు.. నా ప్రజలను కాపాడాలి.. నన్ను బతికియ్యి అని దివి నుండి భువికి దిగొచ్చిండు. మనకోసం వచ్చి తెలంగాణ తెచ్చిండ్రు. ఇప్పుడు ‘సోనియమ్మ ఇచ్చిన్రు.. మేం ఇచ్చినం’ అని కాంగిరీసోళ్లు అంటున్నరు.. ఆ పార్టీ వాళ్ల అయ్యదా.. కాదు.. తెలంగాణ బిడ్డలు పోరాడితే వచ్చింది.. వచ్చిన తెలంగాణను కేసీఆర్ వృథా గానియ్యలె.. రైతులను రాజులను చేసిండు.. ఆడివిల్ల పెండ్లంటే లక్షపదహారు రూపాయల కల్యాణలక్ష్మి ఇచ్చి ఆ పిల్లకు మేనమాన అయ్యిండు.. ఆ పిల్ల మిగతా IIవ పేజీలో
పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు, పప్పు, అన్నం, తొమ్మిది నెళ్లు అన్నం పెట్టిన్రు.. తొమ్మిది నెల్ల తర్వాత పురిటి నొప్పులొత్తే అంబులెన్స్ పిలిపించి.. హాస్పిటళ్ల ఏపించి.. ఆడబిడ్డ పిల్ల పుడితే చేతికి రూ.13 వేలు ఇచ్చి, తల్లికీపిల్లకు బట్టలు.. పిల్లకు బేబీ సోపు, బేబీ వాయిలు, బేబీ కాటిక, బేబీ పొడర్.. తల్లీకి పిల్లకు బట్టలు పెట్టి మేనమామలెక్క సూటికేసు ఇచ్చి ఇండ్లకు తొలిండు కేసీఆర్.. కాంగ్రెస్సోళ్లకు చాతనైతదా ఇది? రేవంతం.. కేసీఆర్ కిట్టు ఇచ్చిండా..? లేదూ.. రైతుభరోసా ఇచ్చిండా? రొండు లక్షల రుణమాఫీ జేసిండా? ఇయ్యలేదు.. కేసీఆర్ ఉన్ననాడు రైతుకు యూరియా, కొరత లేకుండా ఇచ్చిన్రు..
ఆయనున్నప్పుడు రైతు గల్లేగిరేసుకొని బతికిండు.. ఆటో డైవర్లు సచ్చిపొతున్రు.. ఇగ ఆయ్యాలా..వో..మేం జేత్తమని భట్టి విక్రమార్క ఇంటికొచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకొన్రి అని సెంటుగొట్టి ఇచ్చి గెలువంగనె అన్ని అమలు జేత్తమని చెప్పిన్రు.. మాకు ఇచ్చినవా తులం బంగారం? మా బిడ్డకు స్కూటీ ఇచ్చినవా? పోనీ నా మొగడు వికలాంగుడు రూ.4వేలు ఇచ్చినవా? మా అత్తకు, నాకు రూ.4 వేలు ఇచ్చినవా? (తన మెడలో ఉన్న నెక్లెస్‌ను చూపిస్తూ) ఈ నకిలీసు నువ్విచ్చినదేనా? చెప్పు? మరీ ఎందుకు మాట్లాడిన్రు? ఇయ్యాల మేమూ మేమూ అని ముంగట వడుతున్నారు.. పనులు జేసింది బీఆర్ఎస్ పార్టీ.. మా కేసీఆర్ అన్న.. కానీ కాంగిరీసోళ్లు ఒక్కటే ప్రాజెక్టు పట్టుకొని ఇది కుంగిపోయింది..
కుంగిపోయింది.. అంటుండ్రు. సచ్చిపోయిన బర్రె బుడ్డెడు పాలిచ్చిందని.. ఆ సచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుత్తున్నరు… మా అన్న కేసీఆర్ చేసిండు.. ప్రగతి భవన్ కట్టించిండు.. సచివాలయం కట్టిచిండు.. అమరవీరుల తూపం (స్థూపం) కట్టించిండు.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిండు.. దానికెదురుగా తెలంగాణ తల్లి.. దానికెదురుగా అమరవీరుల తూపం.. ఈ ముసలోళ్లు తిరుపతి పోతుండ్రని తిరుపతిలెక్క యాదాద్రి కట్టిండు.. అప్పుగాదా? అయ్యా..రేవంత్.. మిట్రోలు (మెట్రో) రైలు ఏసినవ.. పిచ్చి బస్సు ఏసినవ్ ఒకటి.. నీ బస్సు పాడువడా.. ఆడోళ్లు కొట్టుకుంటున్రు.. మా కేసీఆర్ మిట్రోల్ రైలు ఏసిండు.. పరీక్ష ఉంటే ఐదు నిమిషాలల్ల ఆడబిల్లలు పొతున్రు..
గుళ్లు, గోపురాలు, ప్రాజెక్టులు, మా సారు అమెరికా నుంచి 33 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది.. 33 నర్సరీ కాలేజీలు తెచ్చిన్రు.. మీరు ఉన్ననాడు రొండు లేవు.. ఓ.. మేం జేసినం.. మేం గెలుత్తం అని జూబ్లీహిల్స్‌ల ఓర్లుతున్నరు.. ఎందుకు గెలుత్తరు.. ఏం జేసిన్రు.. మీ పనిని చూపించండి.. నవీన్‌యాదవ్ మంచోడే కావచ్చు.. ఆయన నిలవడ్డ కాంగిరీసు బిస్మేట్ మంచిదిగాదు.. అందుకే నవీన్‌యాదవ్ నీకెయ్యరు ఓట్లు.. కారు..కారు..కారు.. అంటున్రు జనం.. కాబట్టి మా సునీతమ్మ గెలుత్తది.. గులాబీ జెండా ఎగురుతది.. సునీత గెలుత్తది కచ్చితంగా.. ఇది కాన్పామ్.. జై తెలంగాణ’ అంటూ ముగించారు.